Begin typing your search above and press return to search.

తెలంగాణలో పీకే రీ-ఎంట్రీ.. రేవంత్‌కు చెక్ పడుతుందా..? బీఆర్ఎస్‌కు ప్రాణం పోస్తారా?

జాతీయ స్థాయిలో ప్రియాంక గాంధీతో సమావేశం అవ్వడం ద్వారా కాంగ్రెస్‌కు కూడా వ్యూహాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   23 April 2026 9:30 AM IST
తెలంగాణలో పీకే రీ-ఎంట్రీ.. రేవంత్‌కు చెక్ పడుతుందా..? బీఆర్ఎస్‌కు ప్రాణం పోస్తారా?
X

పక్కా లెక్కలతో రాజకీయ వ్యూహాలు రచించే ప్రశాంత్ కిషోర్ (PK) మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా జగిత్యాల సభ తర్వాత కేసీఆర్ వేగం పెరగడం వెనుక, ఏప్రిల్ 25న మెడ్చల్‌లో కవిత తన కొత్త పార్టీని ప్రకటించబోతుండడం వెనుక పీకే వ్యూహాలే ఉన్నాయన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

భారతీయ రాజకీయాల్లో అత్యంత విజయవంతమైన స్ట్రాటజిస్ట్‌గా గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు తన ఫోకస్‌ను మళ్లీ తెలంగాణ వైపు మళ్లించారు. సొంతంగా పెట్టిన ‘జన్ సూరాజ్’ పార్టీకి బిహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో పీకే మళ్లీ తన పాత వృత్తిలోకి వచ్చి సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కవిత కొత్త పొలిటికల్ ఎంట్రీకి ఆయన వెన్నుదన్నుగా నిలవడం తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది.

పీకే వర్సెస్ రేవంత్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రశాంత్ కిషోర్‌కు మధ్య శత్రుత్వం బహిరంగ రహస్యం. గతంలో రేవంత్ రెడ్డి పీకేను ఉద్దేశించి చేసిన ‘బిహారీ డీఎన్ఏ’ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ‘తెలంగాణకు వచ్చి మరీ రేవంత్ రెడ్డిని ఓడిస్తాను’ అని పీకే గతంలోనే బహిరంగంగా సవాల్ విసిరారు. ఇప్పుడు కేసీఆర్ అడిగిన వెంటనే బీఆర్ఎస్‌కు సలహాలు ఇవ్వడానికి పీకే అంగీకరించడం వెనుక ప్రధాన కారణం రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, రేవంత్ రెడ్డి 'వన్‌మ్యాన్ ఆర్మీ'గా దూసుకుపోతుంటే, అతడిని అడ్డుకోవడానికి పీకే పక్కా లెక్కలతో రంగంలోకి దిగారు.

కవిత కొత్త పార్టీ – పీకే ప్లాన్!

కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న మేడ్చల్ లో తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, 50 నియోజకవర్గాల కమిటీల ఎంపిక వెనుక పీకే టీమ్ విసృతంగా చేస్తోందని సమాచారం. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చి, అస్తిత్వ వాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం పీకే వ్యూహంలో భాగం. బీఆర్ఎస్ క్యాడర్‌లో ఉత్సాహం నింపడానికి పీకే ఇప్పటికే ఒక రహస్య సర్వే పూర్తి చేసి కేసీఆర్ కు నివేదిక ఇచ్చారని, ఆ నివేదిక ఆధారంగానే జగిత్యాల సభను విజయవంతంగా నిర్వహించారని తెలుస్తోంది.

అందరికీ పీకేనేనా?..

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పీకే కేవలం బీఆర్ఎస్‌కే పరిమితం అవ్వడం లేదు. జాతీయ స్థాయిలో ప్రియాంక గాంధీతో సమావేశం అవ్వడం ద్వారా కాంగ్రెస్‌కు కూడా వ్యూహాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తూనే, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరపడం పీకే మార్క్ రాజకీయం. అంటే, ఆయన క్లయింట్లు ఎవరైనా సరే.. ‘విజయమే లక్ష్యం’గా ఆయన పావులు కదుపుతున్నారు.

బిహార్ వైఫల్యం తర్వాత రీ-ఎంట్రీ

బిహార్‌లో 'జన్ సూరాజ్' ఘోరంగా విఫలమవ్వడం పీకే బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురాగలిగితే లేదంటే రేవంత్ రెడ్డిని గద్దె దించగలిగితే, పీకే మళ్లీ ‘ఇండియన్ పొలిటికల్ చాణక్య’గా తన కిరీటాన్ని నిలబెట్టుకుంటారు. దీనికోసం ఆయన తన టీమ్‌ను ఇప్పటికే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కార్యాలయాల్లో మోహరించినట్లు సమాచారం.

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కేసీఆర్ అనుభవాన్ని, రేవంత్ రెడ్డి దూకుడును ఎలా ఢీకొంటాయో చూడాలి. పీకే ఇచ్చే సలహాల వల్లే జగిత్యాల సభ తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ మళ్లీ పెరుగుతోందని క్షేత్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 27న కేసీఆర్ ప్రకటించబోయే 'కొత్త టీమ్' లో పీకే మార్క్ ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.