Begin typing your search above and press return to search.

బీహార్ లో అడుగుపెట్టాలంటే రేవంత్ సారీ చెప్పాల్సిందే : ప్రశాంత్ కిషోర్ డిమాండ్

బీహారీ ప్రజల పట్ల సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం, అగౌరవం ఉంది.” అని మండిపడ్డారు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 6:11 PM IST
బీహార్ లో అడుగుపెట్టాలంటే రేవంత్ సారీ చెప్పాల్సిందే : ప్రశాంత్ కిషోర్ డిమాండ్
X

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమీకరణలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో జన్‌ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయంగా దూకుడు పెంచారు. అధికార నితీష్ కుమార్, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. బీహార్ పట్ల రాహుల్‌కు ఉన్న నిబద్ధతను ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు.

జన్‌ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్ తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. “బీహార్‌లో అట్టడుగు వర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు. బీహార్‌లోని‌ ఏదైనా గ్రామంలో ఒక్క రాత్రి రాహుల్ ఉండాలని నేను సవాల్ చేస్తున్నాను. రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారు.. పోతున్నారు. కానీ, ఎలాంటి యాత్రలు చేపట్టడం లేదు. రాహుల్ ఏదైనా ఒక గ్రామంలో ఒక్కరోజు ఉండగలిగితే.. ఆయన వ్యాఖ్యలను నేను అంగీకరిస్తాను. మీరు ఢిల్లీలో కూర్చుని.. బీహారీలను చూసి నవ్వండి. మాకు ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రం ఇక్కడి రండి” అని ఘాటు విమర్శలు చేశారు.

ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రశాంత్ కిశోర్ టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. “తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, టీడీపీతో సంబంధాలున్నాయి. చివరకు కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి కాగలిగారు. సీఎం అయిన తర్వాత ఆయన బీహారీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శ్రమ చేయడం బీహారీల డీఎన్‌ఏలోనే ఉంది. బీహారీలు అంతా లేబర్స్.. బీహారీలు శ్రమ చేయడం కోసమే పుట్టారు అంటూ ఆయన మాట్లాడారు. ఆయన ఎందుకు అలా అన్నారు? బీహారీ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. బీహారీ ప్రజల పట్ల సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం, అగౌరవం ఉంది.” అని మండిపడ్డారు.

ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన వివరణ ప్రకారం, గతంలో కేసీఆర్ తన ప్రభుత్వంలో కొన్ని కీలక హోదాల్లో బీహారీ అధికారులను నియమించుకున్నారు. ఆ దిశగా విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేవనెత్తి కాంగ్రెస్ ను ఇరుకునపెట్టారు. “1989లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ బీహార్‌ను అభివృద్ధి కేంద్రంగా మారుస్తానని చెప్పారు. ఆ డబ్బు ఎక్కడికి పోయింది? ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి మీరు బీహార్‌కి ఏం చేశారో మాకు చెప్పండి?” అని ప్రశ్నించారు. “సిక్కులకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ క్షమాపణ చెబితే.. రాహుల్ గాంధీ బీహార్‌లో ప్రచారం చేసే ముందు బీహారీలకు కూడా క్షమాపణ చెప్పాలి. బీహారీలు శ్రమ కోసమే పుట్టినట్లయితే, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? తెలంగాణలో ప్రచారం చేసి అక్కడ మీ ఓట్లు పొందండి. బీహార్‌లో కాంగ్రెస్ కు ఉనికి లేదు. రాహుల్ గాంధీకి నిజంగా రాజకీయ బలం ఉంటే, ఆయన బీహార్‌లో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలి. లాలూ పార్టీతో పొత్తు లేకుండా బరిలో దిగాలి” అని సవాల్ విసిరారు.