ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎక్కడా వినిపించని ప్రశాంత్ కిషోర్ పేరు!
ఐదేళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో గెలిచామని చెప్పిన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సైతం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను పక్కన పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 11 April 2026 4:00 PM ISTదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ప్రముఖంగా వినిపించే పేరు ప్రశాంత్ కిషోర్. ఒకప్పుడు తన ఎన్నికల వ్యూహాలతో రాజకీయాలను శాసించేవారని ప్రశాంత్ కిషోర్ కోసం చెబుతుంటారు. అయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఐదేళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో గెలిచామని చెప్పిన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సైతం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను పక్కన పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల పదును తగ్గిందా? లేక తమ సొంత వ్యూహాలే బెటర్ అన్న భావనకు పార్టీలు వచ్చాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
పీకేని వదిలేసిన డీఎంకే, తృణమూల్
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇప్పటికే మూడు రాష్ట్రాలకు పోలింగ్ ముగిసింది. అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికలకు ఓటింగ్ ముగియడంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ప్రధాన రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల హోరు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఈ రెండు రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకు ఐదేళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశారు. అప్పట్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఆయా రాష్ట్రాల్లో డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించారంటూ క్రెడిట్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు గత ఎన్నికల కంటే తీవ్రమైన పోటీ జరుగుతున్నా ఆయా పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించకపోవడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
మారిన తలరాత
ఇంతకు ముందు దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు చాలా డిమాండ్ ఉండేది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆ ఎన్నికల్లో మోదీ ఘన విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ఆయన పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన వ్యూహాలతో పార్టీల తలరాత మార్చుతున్నానని భావించిన ప్రశాంత్ కిషోర్.. తన తలరాత మార్చుకుందామని భావించి వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మార్చారు. స్వరాష్ట్రం బిహార్ లో సొంతంగా పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు.
పట్టించుకోని దళపతి
దేశవ్యాప్తంగా మ్యాజిక్ చేస్తున్నానని ప్రచారం చేసుకున్న ప్రశాంత్ కిషోర్ పాచికలు బిహార్ లో పారలేదని తేలిపోవడంతో ఒక్కసారిగా ఆయన ప్రతిష్ట మసకబారిందని చెబుతున్నారు. దీంతో బిహార్ ఎన్నికల తర్వాత ఆయన వ్యూహాల్లో పసలేదని పార్టీలు గ్రహించాయని అంటున్నారు. ఈ కారణంగానే తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించలేదని చెబుతున్నారు. తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన దళపతి విజయ్ మొదట్లో పీకే వ్యూహాల కోసం చర్చలు జరిపారని టాక్ వినిపించింది. అయితే విజయ్ కూడా ఆ తర్వాత పీకేను లైట్ గా తీసుకోవడంతో ప్రస్తుతం పీకే ఊసులేకపోయిందని అంటున్నారు.
