Begin typing your search above and press return to search.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ కి షాక్.. బంకిపూర్ ఉప ఎన్నికల్లో సంచలనం దిశగా ప్రశాంత్ కిశోర్

బిహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ స్థానం బీజేపీకి కంచుకోటగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి 2010 నుంచి 2025 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   3 Aug 2026 2:03 PM IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ కి షాక్.. బంకిపూర్ ఉప ఎన్నికల్లో సంచలనం దిశగా ప్రశాంత్ కిశోర్
X

బిహార్ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ఎదురీదుతోంది. ఆ రాష్ట్ర రాజధాని పట్నా నడిబొడ్డున ఉన్న బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారనే సమాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత నెల 30న బంకీపూర్ తోపాటు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ మూడు స్థానాల్లో ఒక చోట కాంగ్రెస్, మరోచోట బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బిహార్ లోని బంకిపూర్ స్థానంలో పీకే గెలుపు దిశగా సాగడమే హాట్ టాపిక్ అవుతోంది. మొత్తం మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ గుజరాత్ లో తప్ప మిగిలిన రెండు స్థానాల్లో వెనకబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బిహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ స్థానం బీజేపీకి కంచుకోటగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి 2010 నుంచి 2025 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 50 వేల ఓట్ల మెజార్టీతో నితీన్ నబీన్ నాలుగోసారి గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులు కావడం, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో రాజ్యసభకు ఎంపిక అవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పోటీకి దిగడంతో ఈ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఆకర్షించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్కచోట కూడా జనసురాజ్ పార్టీ అభ్యర్థులు గెలవలేకపోయారు. సరికదా కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేకపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ అధికార బీజేపీకి షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పీకే పోటీ చేయడాన్ని బీజేపీ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. కానీ, తనదైన వ్యూహాలతో ప్రశాంత్ కిషోర్ దూసుకుపోవడంతో బీజేపీ వెనకబడిందని విశ్లేషిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇందులో ప్రశాంత్ కిషోర్ 26,113 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కంటే ముందంజలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 7,119 ఓట్లతో పీకే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడి నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీకి దిగిన రేఖాకుమారి 5583 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. జేఎస్పీ, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ జరుగుతోంది. ఇంకా 18 రౌండ్ల కౌంటింగ్ ఉంది. దీంతో చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ సొంత గడ్డపై ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం నమోదు చేసే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు దశాబ్దాలుగా బంకిపూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉంటూ వస్తోంది. పట్టణ ప్రాంత ఓటర్లు, వ్యాపారులు, మధ్యతరగతి వర్గాలు అధికంగా ఉండే ఈ స్థానంలో నితీన్ నబీన్ వరుస విజయాలు సాధించారు. కానీ, ఇప్పుడు బీజేపీకి ఎదురుగాలి వీయడమే చర్చకు తావిస్తోంది.

వాస్తవానికి ఈ ఉప ఎన్నికను బీజేపీ చాలా తేలికగా తీసుకుంటుందని భావించినప్పటికీ, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గం కావడంతో పాటు, బిహార్‌లో తొలిసారిగా ఏర్పడిన బీజేపీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ఇది తొలి అసెంబ్లీ ఎన్నికల సవాల్ కావడంతో కమలదళం దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బూత్ స్థాయి వరకు మోహరించి తీవ్రంగా ప్రచారం చేయాల్సి వచ్చిందంటే, బంకిపూర్‌లో బీజేపీ ఎంతటి ఆందోళనలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రశాంత్ కిషోర్ సరికొత్త రాజకీయ వ్యూహం

గతంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఈసారి బంకిపూర్ ఉప ఎన్నికను ప్రశాంత్ కిషోర్ అత్యంత వ్యూహాత్మకంగా మలచుకున్నారు. "ఇది బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై, వారి అహంకారంపై జరిగే ప్రజాభిప్రాయ సేకరణ" అని పీకే తీవ్రంగా ప్రచారం చేశారు. బీజేపీ నాయకులు కొందరు "బంకిపూర్‌లో పిల్లిని లేదా కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది" అంటూ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సాధారణంగా బీజేపీకి వెన్నెముకగా నిలిచే అగ్రవర్గాలు కాయస్థులు, భూమిహార్లు, రాజ్‌పుట్లు, బ్రాహ్మణులు అలాగే బనియాలు, మార్వాడీల ఓట్లతో పాటు, నితీశ్ కుమార్ వర్గానికి చెందిన కూర్మీలు, దళితులు, ఈబీసీలు నివసించే 50కి పైగా మురికివాడలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జన సురాజ్ పార్టీకి కలిసొచ్చింది. బీజేపీ సైతం అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందంటే, పీకే సృష్టించిన రాజకీయ వేడి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

దేశవ్యాప్త చర్చ

ఇన్నాళ్లూ తెరవెనుక ఇతర పార్టీల విజయాలకు రూపకల్పన చేసిన ప్రశాంత్ కిషోర్, తన సొంత రాష్ట్రంలో పార్టీని నిలబెట్టడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. ఇప్పుడు స్వయంగా ఎన్నికల బరిలోకి దిగి ప్రత్యక్ష రాజకీయాల్లో తన సత్తా చాటుతుండటం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. బీజేపీకి చెందిన బలీయమైన యంత్రాంగాన్ని, జాతీయ అధ్యక్షుడి హోదాను ఎదుర్కొంటూ పీకే లీడ్‌లో కొనసాగడం బిహార్ రాజకీయాల్లో నూతన సమీకరణాలకు తెరలేపుతోంది. బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితాలు కేవలం ఒక నియోజకవర్గ గెలుపు ఓటములకే పరిమితం కాకుండా, బిహార్ భవిష్యత్ రాజకీయ గమనాన్ని, ప్రశాంత్ కిషోర్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక మైలురాయిగా నిలవనుందని వ్యాఖ్యానిస్తున్నారు.