Begin typing your search above and press return to search.

వామ్మో.. మైండ్ బ్లోయింగ్ లెక్కలు.. తొలిసారిగా బయటకు పీకే ఆస్తుల చిట్టా

బిహార్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా ఎన్నికల రణరంగంలోకి దిగారు.

By:  Tupaki Political Desk   |   14 July 2026 4:12 PM IST
వామ్మో.. మైండ్ బ్లోయింగ్ లెక్కలు.. తొలిసారిగా బయటకు పీకే ఆస్తుల చిట్టా
X

బిహార్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఇప్పటివరకు తెరవెనుక వ్యూహాలకే పరిమితమైన పీకే ప్రస్తుతం బంకీపూర్త అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. 2025లో బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసురాజ్ పార్టీ పోటీ చేసినా ఎక్కడా గెలవలేదు. ఈ నేపథ్యంలో పీకే ఉప ఎన్నికల్లో బోణీ కొట్టి అసెంబ్లీలో అడుగు పెడతారా? అన్న ఆసక్తి నెలకొంది.

ఇక సోమవారం నామినేషన్ దాఖలు చేసిన పీకే తొలిసారిగా తన ఆస్తులు, అప్పుల చిట్టా బయటపెట్టారు. వీటితోపాటు ఆయనపై పెండింగులో ఉన్న కేసుల వివరాలు తెలిశాయి. పీకే స్వయంగా వెల్లడించిన ఆస్తుల వివరాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నికల వ్యూహాకర్తగా ఆయన వందల కోట్లు ఆస్తులు పోగేయడం విశేషంగా చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత పీకే అపారమైన ఆదాయాన్ని ఆర్జించారని ఆయన ఎన్నికల అఫిడవిట్ చెబుతోంది. నామినేషన్ పత్రంతోపాటు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ప్రశాంత్ కిషోర్ ఆస్తుల విలువ వంద కోట్లు దాటడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

రాజకీయ సలహాదారుగా వృత్తి, బ్యాంక్ డిపాజిట్లు, కన్సల్టెన్సీ ఫీజులను తన ప్రధాన ఆదాయ వనరుగా పీకే పేర్కొన్నారు. పీకే పేరిట మొత్తం రూ.105 కోట్ల ఆస్తులు ఉండగా, కేవలం రూ.5.78 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక ఆయన భార్య జాహ్నవి దాస్ పేరుతో ఏకంగా 112 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇందులో చరాస్తులే రూ.99.52 కోట్లుగా ఉండటం గమనార్హం. పీకే భార్య జాహ్నవి దాస్ వృత్తిరీత్యా డాక్టర్. ఢిల్లీలోని అపోలో ఇంద్రప్రస్థ హాస్పిటల్లో సీనియర్ అడ్వైజర్ గా ఆమె సేవలు అందిస్తున్నారు. ఇక పీకే కుమారుడు దైబిక్ భరద్వాజ్ పేరిట కేవలం రూ.7.19 లక్షల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. మరోవైపు పీకేపై 8 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలియజేశారు. ఇందులో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, అల్లర్లు, అక్రమంగా గుమికూడటం వంటి కేసులు ఉన్నాయి.

కాగా, తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ఆదరణను ఓట్లుగా మార్చుకోవడం ఆయనకు పెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. స్వయంగా వ్యూహాలు రచిస్తూ బడా నేతలను ప్రధాని, ముఖ్యమంత్రి పీఠాల్లో కూర్చోబెట్టిన ట్రాక్ రికార్డు ఉన్న ప్రశాంత్ కిషోర్ ఈ ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టగలరా? అన్నదే ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లెల్లో పాదయాత్రలు చేస్తూ సామాన్యుడిలా కనిపిస్తున్న ఆయన, తన సంపన్నుడి ఇమేజ్‌ను, ప్రత్యక్ష రాజకీయాల్లో తనకున్న తక్కువ అనుభవాన్ని అధిగమించి బంకిపూర్ ఓటర్లను ఎలా ఒప్పిస్తారన్నది కీలకంగా చెబుతున్నారు. తెరవెనుక ఉండి రాజకీయాలను శాసించిన వ్యూహకర్త, ఇప్పుడు స్వయంగా ఓట్లు అడుగుతుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.