బిహార్ ఎన్నికల్లో పీకే ‘గేమ్ చేంజర్’ అవుతాడా..? రెండు భాగస్వామ్య పక్షాల గతి ఇదే..?!
భారత రాజకీయ చిత్రపటంలో ప్రశాంత్ కిశోర్ (పీకే) పేరు వినిపించని ఎన్నిక దాదాపు ఉండదంటే ఆశ్చర్యం కాదు.
By: Tupaki Desk | 16 Sept 2025 1:57 PM ISTభారత రాజకీయ చిత్రపటంలో ప్రశాంత్ కిశోర్ (పీకే) పేరు వినిపించని ఎన్నిక దాదాపు ఉండదంటే ఆశ్చర్యం కాదు. ఈయన వ్యూహకర్త, గతంలో అనేక రాష్ట్రాల్లో పార్టీలు గెలవడానికి కీలకంగా పనిచేశారు. అనుభవం, విశ్లేషణ శైలి కారణంగానే ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 2014లో నరేంద్ర మోదీని భారతప్రధాని చేసేందుకు బీజేపీ గెలిచేందుకు గెలుపు కర్ర పట్టించిన పీకే ఆ తర్వాత మమతా బెనర్జీ, కాంగ్రెస్, జేడీయూ వంటి అనేక పార్టీలకు కీలక వ్యూహాలు అందించారు. ఎక్కడికెళ్లినా ఓటర్ల మనోభావాలను విశ్లేషించి, స్థానిక సమస్యలను పట్టుకొని, వాటి ఆధారంగానే రాజకీయలు నడుపుతూ తను మద్దతిచ్చే పార్టీని కూర్చీలో కూర్చొబెట్టడం ఆయన స్టయిల్. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ను గద్దెనెక్కించిన పీకే 2024లో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇచ్చిన సలహాలు వైసీపీ ఓటమికి దారితీసాయన్న వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి.
నేరుగా బరిలోకి పీకే పార్టీ..
ఇప్పుడు ఆయన స్వరాష్ట్రం బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వేదికపైకి అడుగుపెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆయన స్థాపించిన ‘జన్ సురాజ్ పార్టీ’ బిహార్ యూత్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆయన రాష్ట్రంలో పాదయాత్రలు చేపట్టి ప్రజల్లో మమేకం అయ్యారు. అవినీతి వ్యతిరేకం, రిజర్వేషన్ల రక్షణ, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను తన పార్టీ రాజకీయ అజెండాలో ఉంచారు. బిహార్‌లో పెరుగుతున్న నిరుద్యోగం, అభివృద్ధి లోటు వంటి సమస్యలను పట్టుకొని ఆయన కొత్త తరహా రాజకీయాలకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఎటువైపు మొగ్గని పీకే..
బిహార్ ఎన్నికల్లో ప్రధానంగా రెండు కూటములు బరిలో ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి (ఆర్జేడీ, ఎల్జీపీ, ఆప్, వామపక్షాలు), మరోవైపు జేడీయూ-బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ. కానీ పీకే మాత్రం ఎవరితోనూ కలవలేదు. ప్రజాపక్షం పేరుతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. ఈ నిర్ణయం ఆయనను ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా ఓట్లను చీల్చనున్నారా..?
తాజాగా వెలువడిన ఒక సర్వే ప్రకారం, జన్ సురాజ్ పార్టీకి కనీసం 8.3 ఓటు శాతం దక్కే అవకాశం ఉందిని తేలింది. ఇది గణనీయమే. ఎందుకంటే, ఈ స్థాయి ఓట్లు ఏదో ఒక కూటమి గెలుపుపై ప్రభావం చూపించగలవు. మరో కీలక అంశం ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పీకే పేరు వినిపించడం. నితీష్ కుమార్ తర్వాత ఆర్జేడీ నేతలు, వారి తర్వాత పీకేను సీఎంగా చూడాలనుకుంటున్న 14 శాతం మంది ఓటర్లు ఉన్నారని సర్వే చెబుతోంది.
పీకే పార్టీతో ఎవరికి లాభం..? ఎవరికి ఖేదం..?
ఈ గణాంకాలు ఒక వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎవరూ పీకేను పెద్దగా పట్టించుకోనట్టే కనిపించినా.. ఆయనను తేలిగ్గా తీసుకోవడం పొరపాటే. ఓటు బ్యాంకు విభజనలో ఆయన పాత్ర కీలకంగా మారబోతోంది. ప్రస్తుతం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రజలు కొంత అసహనంతో ఉన్నారు. ఎక్కువ మంది కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లే అవకాశం ఉంది. అయితే పీకే బలపడితే ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ కూటమి నుంచి గుంజితే బీజేపీ మరోసారి బలపడే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతాయి. ప్రచారం వేళ, అభ్యర్థుల ఎంపిక సమయంలో, స్థానిక సమీకరణాలపై ఆధారపడి ఫలితాలు మారవచ్చు. ఇప్పటి వరకు ఉన్న పరిణామాలు చెబుతున్న సందేశం చూస్తే.. బిహార్ ఎన్నికల్లో పీకే ‘గేమ్ ఛేంజర్’ అవతరించే అవకాశం బలంగా ఉంది.
