Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నికల ముందు బీజేపీకి గట్టి హెచ్చరిక.. బంకీపూర్ ఫలితాలతో మేల్కోవాల్సిందే...

బిహార్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై జాతీయస్థాయిలో విస్తృత చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   4 Aug 2026 4:14 PM IST
యూపీ ఎన్నికల ముందు బీజేపీకి గట్టి హెచ్చరిక.. బంకీపూర్ ఫలితాలతో మేల్కోవాల్సిందే...
X

బిహార్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై జాతీయస్థాయిలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక ఫలితంతో ఇప్పటికిప్పుడు వచ్చే రాజకీయ మార్పు ఏమీ లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో మారనున్న సమీకరణాలకు బంకీపూర్ ఒక సంకేతంగా నిలుస్తుందా? అన్నదే హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బిహార్ లో ఎక్కడా డిపాజిట్ దక్కించుకోలేదు. కానీ, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఊహించని విధంగా సంచలన విజయం సాధించారు. అంతేకాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని తన ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

దేశంలో మొత్తం మూడు రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ ఒక చోట, కాంగ్రెస్ మరోచోట గెలిచాయి. ఈ రెండు స్థానాలు ఆయా పార్టీలు గతంలో ప్రాతినిధ్యం వహించినవి కావడంతో పెద్దగా ప్రాధాన్యం లేకపోయిందని అంటున్నారు. కానీ బంకీపూర్ ఉప ఎన్నిక మాత్రం బీజేపీ అధిష్టానానికి గట్టి షాక్ గానే చెబుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే కాకుండా, బిహార్ లోని తొలి బీజేపీ ప్రభుత్వానికి ఈ ఫలితం పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సహజంగా ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే బంకీపూర్ లో ఆ పరిస్థితి కనిపించకపోవడంపైనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బంకీపూర్ ఉప ఎన్నిక బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. పుష్కరకాలంగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగా కొంత వ్యతిరేకత ఉంటుందని చెబుతున్నారు. అయితే గత 12 ఏళ్లుగా ఇలాంటి వ్యతిరేకతను అధిగమిస్తూ సరికొత్త వ్యూహాలతో బీజేపీ వరుస విజయాలు సాధిస్తూ ఏ పార్టీకి లేని రికార్డులను నమోదు చేస్తోంది. అంతేకాదు 2014లో పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు మనగడ లేని రాష్ట్రాలను సైతం గెలుస్తూ బీజేపీ ఏ పార్టీ సాటిలేదని నిరూపించింది. కానీ, ఒక్క గాలివానకు అంతా తుడిచిపెట్టుకుపోయినట్లు ఇప్పటివరకు బీజేపీ విజయాలన్నీ బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెరమరుగు అవడమే సంచలనంగా మారిందని అంటున్నారు.

మరోవైపు బంకీపూర్ ఉప ఎన్నికతో బీజేపీ అధిష్టానం మేల్కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం దేశంలో మనుగడ సాధించేందుకు ప్రధాన కారణంగా చెబుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం ఒక హెచ్చరికగా భావించాల్సి ఉందని అంటున్నారు. బంకీపూర్ ఓటర్లు బీజేపీని తిరస్కరించడానికి గల కారణాలు విశ్లేషించి ఆ తప్పులు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎందుకంటే బంకీపూర్ స్థానం గత 30 ఏళ్లుగా కాషాయ జెండాకు కంచుకోటగా ఉండటమే కాకుండా, ప్రత్యర్థికి దక్కిన తొలి విజయం కూడా పెను సంచలనానికి ముందస్తు సంకేతంగా భావించాల్సివుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక బంకీపూర్ ఉప ఎన్నిక తర్వాత విపక్షాలకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చిందని అంటున్నారు. ప్రధానంగా బీజేపీకి గట్టి పట్టున్న హిందీ బెల్ట్ లో విపక్షం పైచేయి సాధించేలా తాజా ఎన్నికల ఫలితాలు ఊపు తీసుకువచ్చాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బంకీపూర్ లో జనసురాజ్ పార్టీ గెలవడం ఒక ఎత్తు అయితే, మధ్యప్రదేశ్ లోని బలమైన ప్రభుత్వాన్ని ఢీకొట్టి కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా చెప్పుకోవాల్సిన అంశమే అంటున్నారు. ఈ పరిస్థితులు విపక్షాలకు భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయని చెబుతున్నారు.