వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు.. త్వరలో అరెస్టు!?
వైసీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By: Tupaki Desk | 9 July 2025 11:54 AM ISTవైసీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై కేసు నమోదైంది. ప్రసన్న తీరును నిరసిస్తూ పలువురు మహిళలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సైతం నెల్లూరు ఏఎస్పీకి ఫిర్యాదు అందజేశారు. మరోవైపు మహిళా నేతపై చెత్త వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమారరెడ్డిపై చర్యలకు మహిళా కమిషన్ సైతం రంగం సిద్ధం చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
కోవూరులో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఏ క్షణంలో అయినా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముందుగా విచారణకు పిలుస్తారా? లేక నేరుగా అరెస్టు చేస్తారా? అన్నదే ఉత్కంఠకు గురిచేస్తోంది. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్న ప్రసన్నకుమార్ రెడ్డి అరెస్టుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. దీంతో వాట్ నెక్ట్స్ అన్నదే ఆసక్తికరంగా మారింది.
పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుండటం, తాను అరెస్టుకు సిద్ధమేనంటూ ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో నెల్లూరు రాజకీయం ఉద్రిక్తంగా మారింది. మహిళా నేతపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి దంపతుల పట్ల దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ సమర్థించుకున్నప్పటికీ, ఇలాంటి వ్యాఖ్యలపై కఠినంగా వ్యవహరించకుంటే అధికారంలో ఉండి ఉపయోగం లేదని ప్రభుత్వంపై కూటమి కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన వెంటనే కూటమి కార్యకర్తలు ఆయనపై దాడి చేసి ధ్వంసం చేసినా, వారిలో ఆగ్రహం ఇంకా చల్లారలేదని అంటున్నారు. మరోవైపు తమ నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు, మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలకు వెనక్కి తగ్గడంపై వైసీపీ కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రాజకీయం హైటెన్షన్ గా మారింది.
