వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకు ఊరట.. అరెస్టు ముప్పు తప్పినట్లే..?
వైసీపీకి చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి కోవూరు సిటింగ్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై దారుణ వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొన్నారు.
By: Tupaki Desk | 16 July 2025 5:24 PM ISTటీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ సమయంలో మహిళా నేతపై ఆయన చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం తప్పుపట్టింది. ఇక బుధవారం ఆ పిటిషన్ పై తీర్పు వెల్లడించిన హైకోర్టు నిందితుడికి బీఎన్ఎస్ లోని 35(3) ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు లేవని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
వైసీపీకి చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి కోవూరు సిటింగ్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై దారుణ వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే తన ఇంటిపై టీడీపీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించిన ప్రసన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోగా, రెండో రోజూ అవే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలులో మాజీ మంత్రి కాకాణికి తోడుగా ఉంటానని ప్రకటించిన ప్రసన్న అరెస్టు భయంతో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని స్పష్టంచేసింది. పిటిషనర్ పై నమోదైన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే కావడంతో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని ప్రసన్నకుమార్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే వారి వాదనలతో విభేదించిన ప్రభుత్వ న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, రెండో రోజు వాటిని సమర్థించుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం పోలీసులు పెట్టిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవి కావడంతో ప్రసన్నకుమార్ రెడ్డిని బీఎన్ఎస్ లోని 35(3) ప్రకారం పిలిచి విచారించాలని ఆదేశాలిచ్చింది. ఇక విచారణలో ఆయన చెప్పే అంశాల ఆధారంగా అరెస్టు చేయాలా? వద్దా? అనే నిర్ణయాన్ని పోలీసులు తీసుకోనున్నారు. అయితే గతంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు స్టేషను బెయిలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే పోలీసులు ఈ నిబంధనను అనుసరిస్తారా? లేదా? అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. పోలీసుల తమ విచక్షణతో నిందితుడుని అరెస్టు చేసినా, మేజిస్ట్రేట్ కోర్టులో బెయిలు లభించే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి అనుచితవ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అరెస్టు అయ్యే పరిస్థితుల నుంచి తప్పించుకున్నారనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది.
