Begin typing your search above and press return to search.

కోట్ల జీతాన్ని వదిలి సాధువుగా మారారు..!

దీంతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. జైనమతాన్ని స్వీకరించి, సాధువుగా మారిపోయారు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:26 AM IST
కోట్ల జీతాన్ని వదిలి సాధువుగా మారారు..!
X

ఈ రోజుల్లో డబ్బు, పదవులు, ఫేమ్... ఇవన్నీ జీవిత లక్ష్యాలుగా మారిపోయాయి. ఎంత సంపాదించాలా? ఎంత పవర్‌ ఉండాలా? అనే ఆలోచనలతో రోజులు గడిపే ఈ యుగంలో ఎవరు రూ.75 కోట్లు జీతాన్ని వదులుతారు? కానీ అందరికీ కాకపోయినా... కొందరికి జీవితానికి మరింత గొప్ప అర్థం ఉంది. అలాంటి వారిలో ఒకరు ప్రకాశ్ షా.

ప్రకాశ్ షా పేరు వినగానే ఇండస్ట్రీలో ఎంతో గౌరవం. రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన, ఇండియాలోనే అత్యంత ధనికుడు అయిన ముఖేశ్ అంబానీ కుడిభుజంగా పనిచేసే వ్యక్తి. ఏడాదికి రూ.75 కోట్లు జీతంగా పొందుతూ అపారం విలాసవంతమైన జీవితం గడిపే వారు. ఎన్నో కార్లు, కోట్లు విలువ చేసే బంగ్లాలు, విలువైన షేర్లు... అన్నీ ఆయన సొంతం. కానీ ఈ సంపద ఆయనకు ఆనందాన్ని ఇవ్వలేకపోయింది.

ఒకానొక దశలో ఆయనలో ఓ ప్రశ్న తలెత్తింది. "ఈ డబ్బు అంతా నాకు ఏమి ఇచ్చింది?" స్నేహితులు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి... ఇవన్నీ అతని నుంచి నెమ్మదిగా దూరమవుతున్నాయని తెలుసుకున్నాడు. డబ్బుతో శరీరానికి సుఖం వస్తుందేమో కానీ, మనసుకు శాంతి ఇవ్వదని ఆయన గట్టిగా గ్రహించాడు.

దీంతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. జైనమతాన్ని స్వీకరించి, సాధువుగా మారిపోయారు. ఇప్పుడు ఆయనకు డబ్బు లేదు. విలాసాలు లేవు. కానీ మనశ్శాంతి ఉంది. సుఖమైన నిద్ర ఉంది. అసలైన జీవితం ఎలా ఉండాలో ప్రపంచానికి చూపిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు మనకెందుకు గుర్తుండాలి? మన జీవితాల్లో నిజమైన విలువ ఏమిటో గుర్తుచేసుకోవడానికి. డబ్బు, పదవి, లగ్జరీల కన్నా లోపలి ప్రశాంతత, నెమ్మదైన జీవనం గొప్పదని తెలిపే బోధనగా నిలుస్తుంది ప్రకాశ్ షా జీవితం.

ఇది మరొకసారి చెబుతోంది. ధనవంతులు కావడం కన్నా ధ్యానవంతులు కావడమే గొప్పదని! ఈ ఘటన నిరూపిస్తోంది.