Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి రావాలని రామగిరి ఎస్ఐ ప్లాన్?

రాప్తాడు రాజకీయం ఇంకా రగులుతూనే ఉంది. మాజీ సీఎం జగన్ పర్యటన తర్వాత కూడా అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది.

By:  Tupaki Desk   |   9 April 2025 6:00 PM IST
రాజకీయాల్లోకి రావాలని రామగిరి ఎస్ఐ ప్లాన్?
X

రాప్తాడు రాజకీయం ఇంకా రగులుతూనే ఉంది. మాజీ సీఎం జగన్ పర్యటన తర్వాత కూడా అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అయితే ఈ వివాదంలోకి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇంట్రస్టింగుగా మారింది. మంగళవారం రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలో పర్యటించిన మాజీ సీఎం జగన్ పోలీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎల్లకాలం చంద్రబాబే అధికారంలో ఉండరని, తాము అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలూడదీస్తామని వార్నింగులిచ్చారు. దీంతో పెద్ద వివాదం చెలరేగింది. మాజీ సీఎం హెచ్చరికలపై రామగిరి ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. జగన్ పై ప్రత్యారోపణలు చేశారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ విమర్శలకు కౌంటరుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. ఎస్ఐపై ఓ రేంజులో ఫైర్ అయ్యారు.

మాజీ సీఎం జగన్ తమ బట్టలూడదీస్తామని వార్నింగులివ్వడం కరెక్టు కాదని, తాము కష్టపడి చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని గుర్తించాలని రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి మాట్లాడుతూ, రామగిరిలో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన నుంచి సుధాకర్ యాదవ్ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అక్రమార్జనతో కోట్లు కూడబెట్టిన ఎస్ఐ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సునీత మద్దతుతో పోటీచేయాలని చూస్తున్నారని తోపుదుర్తి ఆరోపించారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు అంత సీన్ లేదని, ఆమె తన కుమారుడికే టికెట్ ఇప్పించుకోలేకపోయారని, మీకు ఎలా సీటు ఇప్పించగలరని ప్రశ్నించారు.

‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల మెప్పుకోసమే ఎస్ఐ సుధాకర్ యాదవ్ మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని తోపుదుర్తి ఆరోపించారు. ఒక మాజీ సీఎంను విమర్శించే స్థాయి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు లేదని తోపుదుర్తి ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వార్థంతో పనిచేస్తున్న సుధాకర్ యాదవ్, తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీరువల్లే రామగిరిలో వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు గురయ్యారని అన్నారు. టీడీపీ నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారని, గతంలో అచ్చెన్నాయుడు, చంద్రబాబు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు గుర్తుకు రావడం లేదా? అంటూ నిలదీశారు.

ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే పరిటాల సునీతకు అనుగుణంగా పనిచేస్తున్నారని, ఆయన సరిగ్గా పనిచేస్తే లింగమయ్య హత్య జరిగేది కాదని తెలిపారు. టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకే నీకు ఖాకీ చొక్కా ఇచ్చారా? అంటూ ఎస్ఐని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్న ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా టీడీపీ టికెట్ పొందాలని చూస్తున్నాడని, ఇంకొకరికి టికెట్ ఇప్పించే స్థాయిలో పరిటాల సునీత లేరన్న విషయం గ్రహించాలని సూచించారు. చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తున్న పోలీసుల బట్టలూడదీస్తామని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని తోపుదుర్తి ప్రశ్నించారు. కురబ లింగమయ్యను ఎమ్మెల్యే సునీత బంధువులు హత్య చేస్తే, సాక్షులుగా టీడీపీ నేతలను పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.