‘కాపాడుకోలేకపోయాం, క్షమించండి’... పహాల్గం దాడిపై ప్రకాశ్ రాజ్!
జమ్ముకశ్మీర్ర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.
By: Tupaki Desk | 24 April 2025 10:55 AMజమ్ముకశ్మీర్ర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆ ఉగ్రదాడిని ఖండించిన ఆయన.. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైందని, మాటలు రావడం లేదని చెబుతూ.. గుండెల్లో అంతులేని బాధతో ఇది రాస్తునట్లు చెప్పి ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
అవును... పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇందులో భాగంగా... పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు ఏప్రిల్ 22 - 2025 అని.. ప్రశాంతమైన ప్రకృతి ప్రదేశమైన పహల్గాంలో నెత్తురు చిందిన రోజని అన్నారు. ఈ క్రూరమైన చర్య గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదని అన్నారు.
ఈ సందర్భంగా... మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంగా కాల్చి చంపారని.. మన అడవులు, అందమైన సెలయేళ్లు, ప్రశాంతమైన వాతావరణం ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితిని ఎదుర్కొన్నారని.. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని.. ఇది కశ్మీర్ పై జరిగిన దాడని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ఇదే సమయంలో... ఇలాంటివి జరిగిన ప్రతీసారీ మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోందని.. ఐడెంటిటీని కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తోందని.. దీనిని అస్సలు క్షమించమని.. ఇది నిజంగా భయంకరమైన చర్య అని.. ఇదే సమయంలో అంతకు మించి పిరికిపంద చర్య అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో.. ఇలాంటి సమయంలో.. కశ్మీరులు మౌనంగా ఉండకూడదని చెప్పిన ప్రకాశ్ రాజ్... మన ఇంటిలో జరిగిన ఈ క్రూరమైన చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నామని.. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడోద్దని వేడుకుంటున్నామని.. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదని.. మా తల్లితండ్రులు హంతకులను పెంచి పోషించలేదని అన్నారు.
ఈ సందర్భంగా... మీరు ఏమి ఆశించి ఇలాంటి దారుణ హింసకు పాల్పడ్డారో తెలియదని ఉగ్రవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ప్రకాశ్ రాజ్.. వారి చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసిందని, పిల్లలను అనాథలుగా మార్చిందని అన్నారు.
ఈ సమయంలో కశ్మీర్ ఆట స్థలం కాదని.. యుద్ధ క్షేత్రం అంతకంటే కాదని.. ఇదేమీ ఉగ్రవాదులు ఉపయోగించుకునే ఆయుధమూ కాదని.. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశం మాత్రమే అని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు అనుభవించే బాధ వారి ఒక్కరిదే కాదని.. అది అందరిదీ అని అన్నారు.
ఇదే సమయంలో... "మీతో మేము దుఃఖిస్తున్నాం.. మీరు కోల్పోయిన దానికి చింతిస్తున్నాం.. మీరు కశ్మీర్ లో ప్రశాంతంగా ఉండటనికి వచ్చారు.. కానీ, మేము దానిని కాపాడుకోలేకపోయాం.. అందుకు క్షమించమని అడుగుతున్నాం" అని ప్రకాశ్ రాజ్ పోస్ట్ పెట్టారు.