Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్‌ కు బెంగళూరు కోర్టు షాక్.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్‌ మరోసారి చట్టపరమైన వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   24 Jun 2026 1:01 PM IST
ప్రకాష్ రాజ్‌ కు బెంగళూరు కోర్టు షాక్.. అసలేం జరిగిందంటే?
X

ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్‌ మరోసారి చట్టపరమైన వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మల్టీపుల్ ఓటర్ ఐడీల కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసినట్లు సమాచారం. కోర్టు ఇప్పటికే పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన హాజరుకాలేదనే కారణంతో ఆ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ కేసు.. 2019 లోక్‌సభ ఎన్నికల టైమ్ లోనిది. ఆ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అనంతరం ఆయనకు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు చేయడంతో వివాదం ప్రారంభమైంది.

ఫిర్యాదు ప్రకారం, ప్రకాష్ రాజ్ నాలుగు రాష్ట్రాల్లో ఓటరు నమోదు కలిగి ఉన్నప్పటికీ ఎన్నికల అఫిడవిట్‌ లో పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆరోపించారు. దీనిపై హలసూరు పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు పిటిషన్‌ను స్వీకరించి విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా ప్రకాష్ రాజ్ కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో పాటు సమన్లకు సరైన స్పందన ఇవ్వలేదని కోర్టు భావించినట్లు తెలుస్తోంది.

దీంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. గతంలో కూడా ఇలాంటి వారెంట్లు జారీ అయినట్లు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో కేసుపై ఆసక్తి పెరిగింది. చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు కావడం నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల వ్యవస్థ క్రెడిబిలిటీను కాపాడేందుకు ఇటువంటి అంశాలను ఎన్నికల సంఘం సీరియస్‌ గా తీసుకుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఆ కేసు మరింత ఇంపార్టెన్స్ సంతరించుకుంది.

ఇక ప్రకాష్ రాజ్ సినీ ప్రయాణం విషయానికి వస్తే, ఆయన సౌత్ సినీ ఇండస్ట్రీలో కాకుండా బాలీవుడ్‌ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత, దర్శకుడిగా పలు రంగాల్లో తన ముద్ర వేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం కూడా ఆయన పలు ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఆ కేసు మళ్లీ వార్తల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టు ఆదేశాలపై లేదా కేసులోని ఆరోపణలపై ప్రకాష్ రాజ్ నుంచి అఫీషియల్ రెస్పాన్స్ రావాల్సి ఉంది. రాబోయే విచారణలో ఆ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం మల్టీపుల్ ఓటర్ ఐడీ ఆరోపణలు, కోర్టు జారీ చేసిన నాన్- బెయిలబుల్ వారెంట్ కారణంగా ప్రకాష్ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు.