Begin typing your search above and press return to search.

'కేసు' ఉంద‌న్నా.. అమెరికా ఎందుకు వెళ్లారు: ప్ర‌భాక‌ర్ రావుకు సిట్ ప్ర‌శ్న‌

తెలంగాణ‌లో తీవ్ర క‌ల‌క‌లం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1గా ఉండి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ ఐజీ, కేసీఆర్ ప్ర‌భుత్వంలో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూర్‌(ఎస్ ఐబీ) చీఫ్‌గా ప‌నిచేసిన ప్ర‌భాక‌ర్ రావును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు సోమ‌వారం సుమారు 8.30 గంట‌ల పాటు విచారించారు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 10:26 AM IST
కేసు ఉంద‌న్నా.. అమెరికా ఎందుకు వెళ్లారు: ప్ర‌భాక‌ర్ రావుకు సిట్ ప్ర‌శ్న‌
X

తెలంగాణ‌లో తీవ్ర క‌ల‌క‌లం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1గా ఉండి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ ఐజీ, కేసీఆర్ ప్ర‌భుత్వంలో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూర్‌(ఎస్ ఐబీ) చీఫ్‌గా ప‌నిచేసిన ప్ర‌భాక‌ర్ రావును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు సోమ‌వారం సుమారు 8.30 గంట‌ల పాటు విచారించారు. మ‌ధ్య‌లో భోజ‌నం, కాఫీ, స్నాక్స్ అందించారు. అయితే.. ఆయ‌న భోజనం చేసేందుకు విముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. దీంతో రెండు సార్లు జ్యూస్ అందించారు. ఇదిలావుంటే.. ఆయ‌న‌ను సూటిగా 22 ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్టు తెలిసింది.

ప్ర‌ధానంగా కేసు న‌మోద‌వుతున్న స‌మ‌యంలో ప్ర‌భాక‌ర్‌రావు అమెరికా వెళ్లిపోవ‌డంపై సిట్ అధికారులు గుచ్చి గుచ్చి ప్ర‌శ్నించి నట్టు తెలిసింది. ''ఈ కేసులో మీ పాత్ర ఉంద‌ని తెలిసే మీరు అమెరికాకు వెళ్లిపోయారా?'' అని ఆయ‌నను ప్ర‌శ్నించ‌గా.. త‌న అనారోగ్య కార‌ణంతో చికిత్స చేయించుకునేందుకు వెళ్లాన‌ని... అస‌లు అప్ప‌టికి ఈ కేసు విష‌యం కూడా త‌న‌కు తెలియ‌ద‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఇదే ప్ర‌శ్న‌ను అధికారులు మార్చి మార్చి అడిగిన‌ప్పుడు కూడా.. త‌న‌ను ఎన్ని సార్లు ప్ర‌శ్నించినా.. ఇదే స‌మాధాన‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఇక‌, మ‌ధ్య‌లో చాలా సేపు ఇంగ్లీష్‌లోనే సంభాషించార‌ని స‌మాచారం. అదేవిధంగా తిరుపతన్న, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాలలోని కీల‌క అంశాల‌ను ఆయ‌న ముందు పెట్టి కూడా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్టు తెలిసింది. అయితే.. వారి వాంగ్మూలాల‌కు త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పారు. తాను ఎవ‌రి ఫోన్ల‌ను ట్యాప్ చేయాల‌ని ఆదేశించ‌లేద‌న్నారు. త‌న‌పై ఎవ‌రూ ఒత్తిడి చేయ‌లేద‌ని.. తాను ఎవ‌రి ఒత్తిళ్ల‌కు లొంగే అధికారిని కూడా కాద‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైతే.. త‌న ట్రాక్ రికార్డును కూడా ప‌రిశీలించాల‌ని ఆయ‌న సూచించిన‌ట్టు స‌మాచారం.

ఇది కేవ‌లం రాజ‌కీయ ప‌ర‌మైన కేసేన‌ని.. తాను ఎవ‌రో చెబితే చేసే వ్య‌క్తిని కాద‌ని ప్ర‌భాక‌ర్‌రావు చెప్పిన‌ట్టు తెలిసింది. అలాగే.. చ‌ట్ట ప్ర‌కారం మాత్ర‌మే తాను న‌డుచుకున్న‌ట్టు తెలిపార‌ని స‌మాచారం. ఈ విచార‌ణ‌ మ‌ధ్య‌లో త‌న‌ను ఎందుకు వేధిస్తార‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించినట్టు స‌మాచారం. మ‌రోవైపు స‌రైన స‌మాధానాలు రాక‌పోవ‌డంతో సిట్ అధికారులు ప్ర‌భాక‌ర‌రావును ఈ నెల 11న మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించారు. కాగా.. ప్ర‌భాక‌ర్‌రావును అరెస్టు చేయ‌కుండా సుప్రీంకోర్టు ర‌క్ష‌ణ క‌ల్పించిన విష‌యం తెలిసిందే.