ఎల్‌నినో ఈజ్ బ్యాక్: వానలు గైర్హాజరు.. ఎండల ఎంటర్‌టైన్‌మెంట్‌కు థియేటర్లు సిద్ధం
ఇక మన రైతన్నల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. వరి, పత్తి, పప్పుధాన్యాల సాగు చేద్దామంటే వాన దేవుడు ఎల్‌నినో మాయలో పడి ఎటో వెళ్ళిపోయాడు.
By: A.N.Kumar | 9 July 2026 11:57 PM ISTప్రకృతి మాత మనకు అప్పుడప్పుడు ఇచ్చే ‘సర్ప్‌రైజ్ గిఫ్టుల’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈసారి అమెరికా వాతావరణ నిపుణులు మోసుకొచ్చిన వార్త చూస్తుంటే.. ఆ గిఫ్ట్ కాస్త ‘హాట్’గా ఉండేలా ఉంది. అవును ప్రపంచ వాతావరణాన్ని తన వేలిముద్రలతో శాసించే ఎల్‌నినో బాబు మళ్లీ బలపడుతున్నారట. అదీ ఇదీ కాదు ఏకంగా 1950ల తర్వాత ఈ రేంజ్ పవర్‌ఫుల్ ఎంట్రీ ఎప్పుడూ చూడలేదట. ఈ తీవ్రత పెరగడానికి 81 శాతం, వచ్చే ఏడాది వరకు మనల్ని పలకరించడానికి 97 శాతం అవకాశాలు ఉన్నాయని లెక్కలు కట్టారు. అంటే వచ్చే ఏడాది వరకు ఈ ‘వేడి’ ముచ్చట్లు తప్పవన్నమాట!
చైనాలో ముంచేసే వానలు.. ఇక్కడ ఎండల ‘జాతర’!
ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంటుందంటే.. ఒకరికి బిరియాని, ఇంకొకరికి ఉపవాసం అన్నట్టు ఉంటుంది. తాజా రిపోర్టుల ప్రకారం చైనాలో భారీ వర్షాలు, వరదలతో పాటు హీట్‌వేవ్స్ కూడా పోటీపడి మరీ వస్తాయట. ఒకపక్క నీళ్లు ముంచెత్తుతుంటే, ఇంకోపక్క చెమటలు కక్కించే ఎండలు.. భలే కాంబినేషన్ కదా!
భారత్ పరిస్థితి చూస్తే.. మన దేశానికి వచ్చేసరికి ఈ ఎల్‌నినో కాస్త ‘కరుడుగట్టిన విలన్’లా మారుతోంది. మన ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలపై ఇది కన్నేసింది. ఆల్రెడీ గత నెలతో పోలిస్తే సగటు వర్షపాతంలో 40% లోటు రికార్డయ్యింది. ‘వర్షం వస్తే వస్తాడు, లేదంటే లేదు’ అన్నట్టు తయారైంది వాతావరణం.
వ్యవసాయం.. ‘ఆకాశం వైపు చూసే’ కాలక్షేపం
ఇక మన రైతన్నల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. వరి, పత్తి, పప్పుధాన్యాల సాగు చేద్దామంటే వాన దేవుడు ఎల్‌నినో మాయలో పడి ఎటో వెళ్ళిపోయాడు. "పంటలు పండించాలా వద్దా అనేది ఇప్పుడు భూమిలో ఉన్న సారం నిర్ణయించడం లేదు, పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కే నీళ్లు నిర్ణయిస్తున్నాయి.. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు కానీ ఆకాశం నుంచి నీళ్లు పడకపోతే రైతులు మాత్రం ఏం చేస్తారు? బహుశా మేఘమథనం కోసం ప్రార్థనలు చేయడం తప్ప..
కేవలం ఎండలే కాదు బాబోయ్.. లిస్ట్ చాలా పెద్దదే ఉంది
ఎల్‌నినో అంటే కేవలం ‘అబ్బా, ఏం ఎండలు’ అని సరిపెట్టుకునే వ్యవహారం కాదు. దీని వెనుక పెద్ద దండయాత్రే ఉంది. అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి. చెట్లు వాటికవే రాపిడితో తగలబడిపోతాయి. తాగునీటి కొరతతో గొంతు ఎండిపోవడం ఖాయం, ట్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. కరెంట్ బిల్లుల మోత మోగిస్తాయి. ఎండలు ఎక్కువైతే ఏసీలు, ఫ్యాన్లు ఫుల్ స్పీడ్‌లో తిరుగుతాయి. ఆటోమేటిక్‌గా కరెంట్ బిల్లు చూసి గుండె ఆగాల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ‘పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం’ అంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూనే ఉన్నాయి. అయితే కేవలం పరిశీలిస్తే సరిపోదు.. ఆ ఎల్‌నినో గాడిని కాస్త కూల్ చేసే మార్గం ఏదైనా ఉంటే చూడాలి. ఏదేమైనా రానున్న నెలల్లో ఈ వాతావరణ ‘సినిమా’ ఏ రేంజ్ హిట్టవుతుందో లేక మనల్ని ఫ్లాప్ చేస్తుందో చూడాలి. ప్రజల్లారా.. ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోండి.. లేదంటే వచ్చే ఏడాది ఎండల్లో ‘ఉడకడం’ ఖాయం..
