ఆ పంచాయతీనే మార్చిన ఒక్క ఓటు..
ఒక్క ఓటు విలువ ఎంత? అనే ప్రశ్నను మనం చాలాసార్లు తేలిగ్గా తీసుకుంటాం. ‘నా ఓటుతో ఏం మారుతుంది?’, ‘ఒక్క ఓటుతో ప్రభుత్వాలు పడిపోతాయా?’ అనే నిర్లక్ష్య భావన పట్టణాలకే కాదు.. గ్రామాల వరకు వ్యాపించింది.
By: Tupaki Desk | 15 Dec 2025 3:58 PM ISTఒక్క ఓటు విలువ ఎంత? అనే ప్రశ్నను మనం చాలాసార్లు తేలిగ్గా తీసుకుంటాం. ‘నా ఓటుతో ఏం మారుతుంది?’, ‘ఒక్క ఓటుతో ప్రభుత్వాలు పడిపోతాయా?’ అనే నిర్లక్ష్య భావన పట్టణాలకే కాదు.. గ్రామాల వరకు వ్యాపించింది. కానీ తెలంగాణలోని నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో జరిగిన బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ నిర్లక్ష్యానికి చెంపదెబ్బలా మారాయి. అక్కడ గెలుపు–ఓటమి మధ్య ఉన్న తేడా ఒక్కటంటే.. ఒక్క ఓటు..
మామ ఓటుతో గెలిచిన కోడలు..
ఈ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిచిన ముత్యాల శ్రీదేవ భవితవ్యాన్ని మార్చింది ఎవరో కాదు.. అమెరికాలో నివసిస్తున్న ఆమె మామ, ఎన్నారై ఓటరు ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి. అమెరికాలో సౌకర్యవంతమైన జీవితం, ఉద్యోగ బాధ్యతలు, ప్రయాణ ఇబ్బందులు అన్నింటిని పక్కనపెట్టి.. కేవలం ఓటు వేయడానికి ఆయన వేల కిలోమీటర్లు ప్రయాణించి నిర్మల్‌కు రావడం ఈ ఎన్నికకు అసలు కథగా మారింది.
గ్రామ పంచాయతీలో మొత్తం 426 మంది ఓటర్లకు గాను 378 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం బాగానే ఉంది అనిపించినా, ఫలితం చూసిన తర్వాత ప్రతి ఓటు ఎంత కీలకమో అందరికీ అర్థమైంది. శ్రీదేవకు 189 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి హరస్వతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లుబాటు కాదని ప్రకటించడంతో.. విజయం, ఓటమి మధ్య నిలిచింది ఒక్క ఓటే. అదే ఓటు ఇంద్రకరణ్ రెడ్డి వేశాడు. ఆయన రాకపోయి ఉంటే? ఫలితం పూర్తిగా భిన్నంగా ఉండేదేమో.
ఇది ఒక గుణపాఠం కావాలి..
ఈ ఘటన ఒక పొలిటికల్ స్టోరీ కాదు.. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన లోతైన సామాజిక సందేశం. ముఖ్యంగా పట్టణాల్లో, చదువుకున్న వర్గాల్లో ఓటింగ్‌పై ఉన్న నిర్లక్ష్యాన్ని ఇది ప్రశ్నిస్తోంది. ‘పని ఉంది’, ‘ట్రాఫిక్ ఉంది’, ‘లైన్ పెద్దగా ఉంటుంది’ అంటూ పోలింగ్ రోజున ఇళ్లలోనే కూర్చునే వేల మంది ఓటర్లకు ఇది ఒక పాఠంగా నిలుస్తోంది. ఒక గ్రామంలో, ఒక పంచాయతీలో ఒక్క ఓటు నిర్ణయాత్మకంగా మారగలిగితే.. పెద్ద ఎన్నికల్లో ప్రతి ఓటు ప్రభావం ఎంత ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు.
ఇంకో ముఖ్యమైన అంశం ఎన్నారైల పాత్ర. సాధారణంగా ఎన్నారైలు రాజకీయాలకు దూరంగా ఉంటారనే అభిప్రాయం ఉంది. కానీ ఇంద్రకరణ్ రెడ్డి ఉదాహరణ ఆ అభిప్రాయాన్ని తప్పుబడుతుంది. విదేశాల్లో ఉంటూ కూడా తన గ్రామం, తన కుటుంబం, తన స్థానిక ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత చూపించడం ఒక అరుదైన విషయమే కానీ అవసరమైన ఉదాహరణ. ఎన్నారైలు కేవలం డబ్బు పంపితే సరిపోతుందన్న భావన కాదు.. ఓటు కూడా ఒక బాధ్యతనే ఆయన చర్య గుర్తు చేసింది.
ఆ ఒక్క ఓటే గెలుపునకు కారణమైందా.?!
ఇది కుటుంబ రాజకీయాల కథగా చూడొచ్చు. కోడలికి మద్దతుగా మామ ఓటు వేయడం, ఆ ఓటే గెలుపునకు కారణం కావడం గ్రామీణ రాజకీయాల్లో అరుదైన ఘటన. కానీ దీన్ని కేవలం బంధుత్వ కోణంలో మాత్రమే చూడడం సరైంది కాదు. అసలు విషయం ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యక్తిగత బాధ్యత. ఒక ఓటరు తన హక్కును వినియోగించుకుంటే ఎంత పెద్ద మార్పు రావచ్చో ఈ సంఘటన చెబుతోంది. ఈ కథ మరో ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. పట్టణాల్లో ఓటింగ్ శాతం ఎందుకు తగ్గుతోంది? చదువు, అవగాహన పెరిగినా ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఎందుకు తగ్గుతోంది? గ్రామాల్లో పోలింగ్ శాతం ఇంకా బాగానే ఉండగా, నగరాల్లో ఎందుకు నిర్లక్ష్యం పెరుగుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే కాదు, సమాజానిదీ కూడా.
బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నిక ఫలితం ఒక చిన్న వార్తలా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న సందేశం చాలా పెద్దది. ప్రజాస్వామ్యంలో చిన్న ఓటు అనే మాటే లేదు. ప్రతి ఓటు ఒక నిర్ణయం. ప్రతి ఓటు ఒక భవిష్యత్తు. ఈసారి అది ఒక సర్పంచ్ పదవిని నిర్ణయించింది. రేపు అది ఒక నియోజకవర్గం, ఒక రాష్ట్రం, ఒక దేశం భవితవ్యాన్నే మార్చవచ్చు. అందుకే ఈ కథ ఒక హెచ్చరికగా నిలవాలి. ‘నా ఓటుతో ఏమవుతుంది?’ అనే ప్రశ్నకు బాగాపూర్ ఇచ్చిన సమాధానం స్పష్టం.. అన్నీ అవుతాయి. ఒక్క ఓటు కూడా చరిత్రను మార్చగలదు.
