Begin typing your search above and press return to search.

పోతిన మహేష్ గుంటూరుకు షిఫ్ట్

జనసేనలో బీసీ నేతగా పెద్ద గొంతుతో మాట్లాడిన వారు పోతిన మహేష్. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బీసీ నాయకుడు.

By:  Tupaki Desk   |   27 May 2025 9:11 AM IST
పోతిన మహేష్  గుంటూరుకు షిఫ్ట్
X

జనసేనలో బీసీ నేతగా పెద్ద గొంతుతో మాట్లాడిన వారు పోతిన మహేష్. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బీసీ నాయకుడు. ఆయన జనసేనకు అతి పెద్ద బలంగా ఉండేవారు. అయితే ఆయనకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇవ్వలేదని ఆగ్రహించి అలిగి మరీ పార్టీకి దూరం అయ్యారు. అంతే కాదు వైసీపీలో చేరిపోయారు. అయితే వైసీపీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పాలు కావడంతో పోతిన మహేష్ రాజకీయం కూడా అయోమయంలో పడింది అని చర్చ సాగింది.

ఇక మొదట్లో కొంత సౌండ్ చేసినా ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయనకు వైసీపీలో సరైన ప్రాధాన్యత దక్కలేదని కూడా ప్రచారం సాగింది. వచ్చే ఎన్నికల్లో అయినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని ఆయన అనుకుంటున్నారు.

అయితే అది నాయకత్వం మాత్రం ఆయనను గుంటూరుకి షిఫ్ట్ చేసింది. ఆయనను గుంటూర్ పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడిగా నియమించింది. దాంతో పోతినను గుంటూరుకు షిఫ్ట్ చేశారా అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే పోతిన మహేష్ తాజాగా గుంటూరు వైసీపీ సమావేశంలో మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాను పార్టీ అభివృద్ధి కోసం పరిశ్రమిస్తాను అని కూడా పేర్కొన్నారు.

మరో వైపు వైసీపీ పుట్టాక గుంటూరు పార్లమెంట్ లో ఇప్పటిదాకా మూడు ఎన్నికలు జరిగితే మూడు సార్లూ వైసీపీ ఓటమి పాలు అయింది. ప్రస్తుతం అక్కడ నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన బలమైన నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు కూడా. ఇక ఆయనతో ఢీ కొట్టే నేత వైసీపీలో ఎవరూ కనిపించడం లేదు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో విజయవాడ పశ్చిమ నుంచి పోతిన మహేష్ ని తీసుకుని వచ్చింది గుంటూరులో ఆయన రాజకీయాన్ని పెంచడానికే అని ఒక టాక్ నడుస్తోంది. బీసీలు కూడా ఎక్కువగా ఉన్న గుంటూరు పార్లమెంట్ పరిధిలో నోరున్న పేరున్న బలమైన బీసీ నేతగా పోతిన మహేష్ కనిపిస్తున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది.

అందుకోసమే ఆయనను రప్పించారని అంటున్నారు. వైసీపీలో బీసీ నేతలు కూడా కూటమి వైపు జారిపోయిన క్రమంలో యువనేతగా ఉన్న పోతిన మహేష్ సేవలను వాడుకోవాలని పార్టీ ఈ విధంగా చూస్తోంది అని అంటున్నారు. మరి విజయవాడ పశ్చిమ మీద మనసు పెట్టుకున్న మహేష్ పార్టీ ఆదేశానుసారం గుంటూరు జిల్లాలో పనిచేస్తారు కానీ ఎంపీగా పోటీ అంటే చాలా పెద్ద వ్యవహారమని అంటున్నారు.

మొత్తానికి అయితే మహేష్ సేవలను వాడుకోవాలని వైసీపీ నిర్ణయించింది అని అంటున్నారు. రానున్న రోజులలో పోతిన మహేష్ గతంలో మాదిరిగానే బిగ్ సౌండ్ తో కూటమి నేతల మీద వారి పాలన మీద గట్టిగా విరుచుకుపడతారా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.