కుండల వ్యాపారికిరూ.13.55 కోట్ల ఐటీ నోటీసులు
రాజస్థాన్ లోని బూందీ జిల్లా ఝూలీజీ కా బరానా గ్రామానికి చెందిన కుండల వ్యాపారి 32 ఏళ్ల విష్ణుకుమార్ ప్రజాపత్. అతడికి వరుస పెట్టి ఆదాయ పన్ను అధికారుల నుంచి నోటీసులు వస్తున్నాయి.
By: Tupaki Desk | 18 April 2025 2:00 PM ISTదేశంలోనే అత్యుత్తమ నెట్ వర్కు కలిగిన కొన్ని సంస్థలు చేసే తప్పులు.. వారి కారణంగా జరిగే పొరపాట్లు అందరిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. కుండలు వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారికి కోట్లాది రూపాయిల ఆదాయపన్నుబకాయి ఉందంటూ వచ్చిన నోటీసును చూసి అవాక్కు అయిన పరిస్థితి. తనకు వచ్చిన నోటీసుతో మీడియా ముందుకు రావటంతో ఇతగాడి నోటీసు ఇప్పుడు వైరల్ గా మారింది.
రాజస్థాన్ లోని బూందీ జిల్లా ఝూలీజీ కా బరానా గ్రామానికి చెందిన కుండల వ్యాపారి 32 ఏళ్ల విష్ణుకుమార్ ప్రజాపత్. అతడికి వరుస పెట్టి ఆదాయ పన్ను అధికారుల నుంచి నోటీసులు వస్తున్నాయి. దీంతో.. అతగాడికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి అతడికి నోటీసు పంపారు.
అతడు రూ.13.55 కోట్ల ఆదాయపన్ను బకాయి ఉన్నట్లుగా ఐటీ శాఖ పేర్కొంది. అయితే.. బాధితుడి పాన్ కార్డు.. ఆధార్ వివరాలు ముంబయికి చెందిన ఒక కంపెనీ దుర్వినియోగం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. నోటీసు అందుకున్న కుండల వ్యాపారి ప్రజాపత్ తన ఏడాది మొత్తం కష్టపడినా.. రూ.లక్ష కంటే తక్కువే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తనకొచ్చిన నోటీసులు చూపిస్తున్నాడు. అందుకే.. మీ ఆధార్.. పాన్ కార్డులు ఒక్కోసారి దుర్వినియోగం అవుతుంటాయి. ఇలాంటి వేళలో.. ఆందోళనకు గురి కాకుండా అధికారుల్ని సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు.
