Begin typing your search above and press return to search.

రామోజీరావుపై పోసాని సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్ ల వ్యవహారం చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Dec 2023 10:05 AM GMT
రామోజీరావుపై పోసాని సంచలన వ్యాఖ్యలు!
X

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్ ల వ్యవహారం చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ ట్యాబ్ లలో కొందరు విద్యార్థులు పోర్న్ వీడియోలు చూస్తున్నారని, చెడిపోతున్నారని ప్రచారం జరుగుతుంది . ఆ ప్రకారం కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే, ఆ ట్యాబ్ లలో మిగతా వెబ్సైట్లు ఓపెన్ కావని, కేవలం క్లాసులకు సంబంధించిన వీడియోలు మాత్రమే ఓపెన్ అవుతాయని వైసిపి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రామోజీరావు పిచ్చి రాతలు రాస్తున్నారని, అసెంబ్లీలో ఎవరో ఒక ఎమ్మెల్యే పోర్న్ వీడియో చూస్తే మొత్తం అసెంబ్లీని రద్దు చేస్తారా అని పోసాని ప్రశ్నించారు. ఆ ట్యాబ్ లలో కొన్ని వెబ్సైట్లు ఓపెన్ అయ్యేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని పోసాని చెప్పారు. ఏపీలో కమ్మవాళ్లే ముఖ్యమంత్రిగా ఉండాలని రామోజీరావు అనుకుంటున్నారని, అందులోనూ చంద్రబాబు సీఎం కావాలని ఆయనకు బలమైన కోరిక ఉందని పోసాని అన్నారు. ఆనాడు మద్యపానం నిషేధించిన దివంగత నేత ఎన్టీఆర్ వి పెద్ద పెద్ద ఫోటోలు వేశారని, కానీ, మద్యపాన ఆదాయం ఉండాలని ఆ తర్వాత రాశారని ఈనాడు పత్రికపై పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాళ్లు, చేతులు పని చేయకపోవడంతో లక్ష్మీపార్వతిని దివంగత ఎన్టీ రామారావు పెళ్లి చేసుకున్నారని చెప్పారు. నమ్మి ప్రేమించి గౌరవించే వాళ్ళు కావాలని ఆయన వివాహం చేసుకున్నారని అన్నారు. కానీ, లక్ష్మీపార్వతి గురించి రామోజీరావు పిచ్చిరాతలు రాశారని, ప్రతిపక్షానికి మిత్రపక్షంగా రామోజీరావు ఉన్నారని ఆరోపించారు. ఇక, ఏపీలో జగన్ ఉండకూడదని రామోజీరావు ప్రయత్నాలు చేస్తున్నారని, కమ్మవాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తున్నాం కదా అని అన్నారు. కోట్లు ఉన్న కమ్మవాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారని రామోజీరావు ఎందుకు రాయడం లేదని పోసాని ప్రశ్నించారు.

రామోజీ ఓ పొలిటికల్ బ్రోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. జగన్ అంటే రామోజీకి ద్వేషమని అన్నారు. రామోజీరావు కడుపున పుట్టడం శాపమని ఆయన కుమారుడు సుమన్ తనతో అన్నాడని పోసాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.