Begin typing your search above and press return to search.

త్వరలో పొసాని కొత్త సినిమా.. భవిష్యత్తుపై క్లారిటీ..

ఇక పోసాని నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారు చేశారు. అరుణా రెడ్డి.. ఆపరేషన్ అరుణా రెడ్డి అన్న టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2025 3:37 PM IST
త్వరలో పొసాని కొత్త సినిమా.. భవిష్యత్తుపై క్లారిటీ..
X

అనుచిత వ్యాఖ్యల కేసులో జైలు పాలై బెయిలుపై విడుదల అయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి మళ్లీ చిత్ర రంగంలోకి ప్రవేశించాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజకీయాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమ నుంచి వెళ్లిన ఆయన కూటమి ప్రభుత్వంలో కేసులను ఎదుర్కొని సుమారు రెండు నెలల పాటు జైలు జీవితం గడపాల్సివచ్చింది. జైలు నుంచి విడులైన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన పోసాని మళ్లీ తన పూర్త రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు.

2009లో రాజకీయ రంగ ప్రవేశం

రచయితగా సినీ రంగంలోకి ప్రవేశించిన పోసాని అనంతరం నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న పోసాని 2009లో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫిలం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గానూ వ్యవహరించారు. అయితే వైసీపీలో ఉండగా, పోసాని నోటి దురుసుతో మాట్లాడేవారని విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించడంతోపాటు వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని అనేక ఫిర్యాదులు ఎదుర్కొన్నారు. దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయనను రిమాండుకు తరలించారు. ఈ ఎపిసోడ్ తర్వాత ఆయన మాట తీరు మారిందని చెబుతున్నారు. కేసులతో ఇబ్బందులు ఎదుర్కొన్న పోసాని.. రాజకీయాల్లో తనకు భవిష్యత్తు లేదని, కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించే స్థాయి తనది కాదని గ్రహించి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడు మళ్లీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

సొంతంగా సినిమా నిర్మాణం

విలక్షణ నటనతో సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. తనదైన మేనరిజంతో సినీ ప్రియుల మనసు దోచుకున్నారు. అయితే రాజకీయాల్లో వివాదాస్పద వైఖరి మూలంగా ఆయనకు సినీ అవకాశాలు బాగా తగ్గిపోయాయని చెబుతున్నారు. ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తోపాటు నందమూరి వంశానికి చెందిన బాలయ్య కుటుంబంతోనూ పోసాని వివాదం పెట్టుకోవడంతో ఆయనకు సినీ అవకాశాలు దూరమయ్యాయని అంటున్నారు. పోసాని వైసీపీలో పనిచేయకముందు ఆయనతో పవన్, బాలయ్య కూడా పనిచేశారు. కానీ, పోసాని వైసీపీలో యాక్టివ్ అయిన తర్వాత, నోటికొచ్చినట్లు మాట్లాడటంతో అగ్ర నటులతోపాటు పెద్ద బ్యానర్లతో గ్యాప్ వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలు లేకపోవడంతో ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోవాలని అనుకున్నారు. కానీ, అంతా రివర్స్ అవడంతో ఇప్పుడు మళ్లీ సినిమాలు తీయాలని భావిస్తున్నారు. అయితే ఆయన సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే సొంతంగా నిర్మించుకోవాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.

కథ సిద్ధం

సినీ రంగంలోకి పునః ప్రవేశించాలని పోసాని నిర్ణయించుకోవడంతోపాటు సినిమా నిర్మాణానికి ఓ కథ సిద్ధం చేసుకున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. తాను తాజాగా రెడీ చేసిన కథ తన గత సినిమాలు అన్నింటిలోకెల్లా ఉత్తమంగా ఉంటుందని ఆయన ఓ మీడియా చానలుతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు 150 సినిమాలకు రచయితగా పనిచేసిన పోసాని వందల సినిమాల్లో నటించారు. ప్రధానంగా శివరాయుడు, పెదరాయుడు, మా అన్నయ్య వంటి చిత్రాలకు ఆయన కథ అందించినట్లు చెబుతున్నారు. తాజాగా సిద్ధం చేసిన కథ.. వాటిని మించినట్లు ఉంటుందని ఆయన చెప్పడంతో ఉత్కంఠ నెలకొంది.

అంతా కొత్తవారే..

ఇక పోసాని నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారు చేశారు. అరుణా రెడ్డి.. ఆపరేషన్ అరుణా రెడ్డి అన్న టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఏదైనా సరే అరుణా రెడ్డి అన్న టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తన సినిమాకు అరుణారెడ్డి అన్న టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు పోసాని కూడా చెప్పారు. ఈ సినిమాలో కథా నాయకుడు, ప్రతి నాయకుడు పాత్రలను తానే పోషిస్తున్నట్లు పోసాని వెల్లడించారు. అదేసమయంలో మిగిలిన పాత్రలకు కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్ లో సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే అరుణా రెడ్డి కథ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. తన జైలు జీవితానికి దారి తీసిన కారణాలు లేదా తాను తప్పు చేయకపోయినా జైలుకు వెళ్లాల్సివచ్చిందనే విషయాలను ఇందులో ఆయన ప్రస్తావిస్తారా? లేక రాజకీయాలకు సంబంధం లేని కథతోనే సినిమా చిత్రీకరిస్తారా? అన్నది చూడాల్సివుంది.