Begin typing your search above and press return to search.

బార్‌ లో 90 నిమిషాల్లో 48 వేలు బిల్లు... ర్యాష్‌ డ్రైవింగ్‌ ముందు...!

మహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసు ఏ స్థాయిలో సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే

By:  Tupaki Desk   |   22 May 2024 6:49 AM GMT
బార్‌  లో 90 నిమిషాల్లో 48 వేలు బిల్లు... ర్యాష్‌  డ్రైవింగ్‌  ముందు...!
X

మహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసు ఏ స్థాయిలో సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే. ఈ ప్రమాదం జరగడం ఒకెత్తు అయితే.. ఆ ప్రమాదం అనంతరం ఆ మైనర్‌ కు 15 గంటల్లోనే బెయిల్ దక్కడం మరెకెత్తుగా మారింది! ఈ క్రమంలో అంతకు మించి అన్నట్లుగా... ప్రమాదానికి ముందు ఆ టీనేజర్ చేసిన పని తాజాగా తెరపైకి వచ్చి వైరల్ గా మారింది.

అవును... పూణెలో టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీనేజర్‌ కి సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... యాక్సిడెంట్ చేయడానికి కొద్దిసేపటి ముందు ఆ మైనర్‌ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు.

ఈ క్రమంలో తొలుత ఒక బార్ కి వెళ్లిన యువకుడు... కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలిసిందని చెబుతున్నారు. అనంతరం అక్కడి నుంచి మరో బార్‌ కు వెళ్లి అక్కడ కూడా మద్యం తాగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్‌ ను బలంగా ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఈ ఘటన నేపథ్యంలో ఆ టీనేజర్‌ డ్రైవింగ్‌ లైసెన్సుపై నిషేధం విధిస్తున్నట్లు మహారాష్ట్ర ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ వివేక్ భిమన్వార్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా... ఆ యువకుడికి 25 ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్‌ లైసెన్సు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. మరోపక్క ఈ కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రితో పాటు ఆ ప్రమాదానికి ముందు సదరు టీనేజర్ వెళ్లిన రెండు బార్ల యజమానులను అరెస్టు చేశారు.

ఇక ఈ కేసులో టీనేజర్‌ తండ్రి పుణెలో పేరున్న ఓ రియల్టర్‌ కాగా... తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ గురించి తెలియగానే తనను అరెస్టు చేస్తారని ఊహించి పరారయ్యేందుకు ప్రయత్నించాడని చెబుతున్నారు. ఇందులో భాగంగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఫోన్ లో సిమ్ తీసి, మరో సిమ్ వేసుకుని కారులో ముంబయి బయల్దేరి.. తనకు చెందిన మరో కారును డ్రైవర్‌ తో గోవాకు పంపించాడట.

మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆ మైనర్‌ కు 15 గంటల్లోనే బెయిల్‌ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసిందని చెబుతున్నారు. అతడి బెయిల్‌ ను రద్దు చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు, అతడిని మేజర్‌ గా పరిగణించి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతినివ్వాలని న్యాయస్థానాన్ని పోలీసులు కోరనున్నట్లు తెలుస్తోంది.