Begin typing your search above and press return to search.

అద్దెగర్భం పద్దతిపై పోప్ ఫ్రావిన్స్ సంచలన వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా గ‌ర్భాన్ని అద్దెకు ఇవ్వడాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 8:01 AM GMT
అద్దెగర్భం పద్దతిపై పోప్  ఫ్రావిన్స్  సంచలన వ్యాఖ్యలు!
X

పిల్లలను కనాలనుకునే జంట నేరుగా కాకుండా మరొక స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని పిల్లలను కనే పద్ధతినే సరోగసీ అంటారనేది తెలిసిన విషయమే. సంతానం కోసం కొందరు జంటలు పడుతున్న ఇబ్బందులు, వారి వ్యక్తిగత కారణాలు ఎలా ఉన్న.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సరోగసీ పద్ధతి ఒక వ్యాపారంగా అవతరించిందనే విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఈ విధానంపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. ఈ విధానాన్ని ఆయన తప్పుపట్టారు.

అవును... ప్రపంచ‌వ్యాప్తంగా స‌రోగ‌సీపై చర్చ జరుగుతుండటం, సరికొత్త చట్టాలు రూపుదిద్దుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో... ఈ విధానాన్ని నిషేధించాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ‌ర్భాన్ని అద్దెకు ఇవ్వడాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఆ విధానం చాలా హేయ‌మైంద‌ని.. ప్రెగ్నెన్సీని క‌మ‌ర్షియ‌ల్ చేయడం స‌రికాదని అన్నారు.

తాజాగా వాటిక‌న్‌ లో ప్రతినిధుల‌తో జ‌రిగిన కొత్త సంవ‌త్సరం వేడుక‌ల్లో పోప్ ఫ్రావిన్స్ ఈ సందేశం వినిపించారు. ఇందులో భాగంగా... గ‌ర్భంలో ఉన్న చిన్నారి ట్రాఫిక్కింగ్‌ కు బ‌లికావొద్దని.. స‌రోగ‌సీ ద్వారా త‌ల్లి కావాల‌న్న కాంక్ష స‌రికాదని తెలిపారు. ఇదే సమయంలో... శిశువును ఓ బ‌హుమ‌తిగా చూడాలే తప్ప దాంట్లో క‌మ‌ర్షియ‌ల్ కాంట్రాక్టు కోణం స‌రికాద‌ని ఆయన స్పష్టం చేశారు.

ఈ క్రమంలో... ఇలాంటి విధానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాన్ చేయాల‌ని క్యాథ‌లిక్ చీఫ్‌ త‌న సందేశంలో ప్రపంచ దేశాల‌ను కోరారు. అనంతరం... ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న సంక్షోభాలు అంతం కావాల‌ని, శాంతి ప‌థంలోనే ప్రజ‌లు గౌర‌వాన్ని ఆశిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

కాగా... పిల్లలను కనాలనుకునే జంటలు నేరుగా కాకుండా వేరే స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని పిల్లలను కనే పద్ధతినే సరోగసీ అంటారనేది తెలిసిన విషయమే. ఇందులో ప్రధానంగా రెండు విధానాలు ఉంటాయి. వీటిలో... పిల్లలు కావాలనుకునే జంటలో.. పురుషుడి వీర్యాన్ని స్వీకరించి మరొక మహిళ గర్భంలో ప్రవేశ పెడతారు. దీంతో... వారి కోసం పిల్లలను తన కడుపులో పెంచి, ప్రసవించి ఇవ్వాలి!

అలా చేసే మహిళను సరోగేట్ మదర్ అంటారు. కేవలం పురుషుడి వీర్యంతో బిడ్డను కని ఇచ్చిన ఆ మహిళ, బిడ్డకు బయోలాజికల్ మదర్ అయినప్పటికీ.. ప్రసవం అనంతరం ఆ బిడ్డతో ఎటువంటి సంబంధం ఉండదు. కనీసం డెలివరీ అనంతరం బిడ్డను కూడా చూపించరని అంటారు! ఈ మేరకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. సరోగసీలో ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతి అని పిలుస్తారు.

ఇక రెండో పద్దతిలో పిల్లలు కావాలనుకునే జంటలోని స్త్రీ అండాన్ని, పురుషుడి వీర్యంతో ఫలదీకరణం చెందిస్తారు. అనంతరం ఆ పిండాన్ని సరోగసీకి అంగీకరించినామె యొక్క గర్భాశయంలో ఉంచుతారు. నాటినుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉండే ఆ మహిళ బిడ్డకు జన్మనిస్తుంది. ఎక్కువమంది జంటలు ఈ పద్దతిని ఎంచుకుంటారు. దీన్ని జెస్టేషనల్ సరోగసీ అంటారు.