వెయ్యేళ్ల ఆచారం.. పోప్ గా ఎన్నికైన వ్యక్తి పేరు మారుతుంది
అవును.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న140 కోట్ల మంది క్యాథలిక్కులకు ఆరాధ్యమైన వ్యక్తిగా నిలిచే పోప్ ఎంతటి శక్తివంతమైన వ్యక్తి అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 23 April 2025 11:36 AM ISTఅవును.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న140 కోట్ల మంది క్యాథలిక్కులకు ఆరాధ్యమైన వ్యక్తిగా నిలిచే పోప్ ఎంతటి శక్తివంతమైన వ్యక్తి అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరకు ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న అధినేత సైతం.. పోప్ ముందు తలవంచాల్సిందే. అంతటి శక్తివంతమైన పీఠం పోప్ పదవి. ఇదిలా ఉంటే.. పోప్ ఎంపికకు సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది. అంతేకాదు.. పోప్ గా ఎన్నికైన వ్యక్తి తనకు అప్పటివరకు ఉన్న పేరును త్యజించాల్సి ఉంటుంది.
ఎందుకిలా? అంటే.. ఇది వెయ్యేళ్ల ఆచారం. దీన్ని తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. అందుకే.. పోప్ గా ఎంపికైన వారు తమ అసలు పేరును వదిలేస్తారు. ఆయన పేరును బైబిల్ లో వర్ణించిన పేర్ల నుంచి ఒకటి ఎంపిక చేసుకొని స్వీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కన్నుమూసిన పోప్ అసలు పేరు జోర్జ్ మారియో బెర్గోగ్లియో. ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి నుంచి స్ఫూర్తి పొందారు. అందుకే ఆయన ఫ్రాన్సిస్ పేరును స్వీకరించారు. దీంతో.. ఆయన పేరు పోప్ ఫ్రాన్సిస్ గా మారింది. ఈ పేరు.. వినయం, పేదలపై కరుణకు చిహ్నంగా భావిస్తారు.
పోప్ గా ఎంపికయ్యే వారు తమ పేరును మార్చుకోవటం వెయ్యేళ్లకు పైగా వస్తున్న ఒక ఆచారం. ఆ పదవిలోకి రాగానే చర్చికి సేవ చేయటంలో కొత్తదశకు చేరుకున్నట్లుగా భావిస్తారు. పోప్ లు తాము ఎంతో ఇష్టపడిన.. అనుకరించాల్సిన వారి పేర్లను ఎంచుకుంటారు. ఈ పదవిలోకి వచ్చిన తర్వాత వారిక ప్రైవేటు వ్యక్తులు ఎంతమాత్రం కారు. ప్రపంచ క్యాథలిక్కు చర్చికి నాయకుడిగా చూస్తారు. పోప్ కావటానికి ముందు ఉన్న వ్యక్తిగత.. జాతీయ గుర్తింపులకు దూరం కావటానికి వీలుగా కొత్త పేరు పెట్టుకుంటారు. క్రీ.శ.533 నుంచి 535 నుంచి పోప్ పదవిలో ఉన్న వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా పలుకుబడి లభిస్తోంది.
అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్కులకు మత గురువుగా ఉండటమే కాదు.. స్వతంత్ర వాటికన్ దేశానికి అధిపతిగా వివిధ దేశాలతో సంబంధాలు నెరుపుతారు. వాటికన్ నగరానికి 180 దేశాలతో దౌత్య సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ పర్యటనలు.. ప్రసంగాలే కాకుండా తెర వెనుక దౌత్యాల్లో పోప్ పాత్ర ఉంటుంది. ఎప్పటినుంచో శత్రువులైన అమెరికా - క్యూబా మధ్య సంబంధాలు నెలకొల్పటంతో పోప్ ఫ్రాన్సిస్ కీలక పాత్ర పోషించారు. ఇలా ఆయన పలు అంతర్జాతీయ అంశాల మీద ఫోకస్ చేయటమే కాదు.. పలు దేశాధినేతల్ని ప్రభావితం చేసే సత్తా ఉంటుంది.
