‘రష్యా గుమ్మంలో నాటో మొరిగింది’.. పోప్ చరిత్రలో నిలిచే వ్యాఖ్యలు
క్యాథలిక్ ల పెద్ద అయిన పోప్ ఫ్రాన్సిస్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు.
By: Tupaki Desk | 21 April 2025 6:00 PM ISTదక్షిణ అమెరికా ఖండం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తి.. 12 ఏళ్లకు పైగా పోప్ గా బాధ్యతలు.. మరణ శిక్షలకు వ్యతిరేకి.. అన్ని మతాల మధ్య సమన్వయం.. వలసదారులపై సానుభూతి.. వాతావరణ మార్పులపై చైతన్యం.. ఇవీ పోప్ ఫ్రాన్సిస్ (88) నాణేనికి ఒకవైపు..
శాంతి దూతగా .. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయారు.. ఇజ్రాయెల్ ను కట్టడి చేయలేకపోయారు.. ప్రపంచ శాంతికి ఆయన పాత్ర పరిమితం.. ఇవీ నాణేనికి మరోవైపు..
క్యాథలిక్ ల పెద్ద అయిన పోప్ ఫ్రాన్సిస్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. అయితే, ఈస్టర్ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన ఆరోగ్యవంతులయ్యారని భావించారు. అంతలోనే సోమవారం కన్నుమూశారు.
పోప్ బెనిడెక్ట్-16 తర్వాత ఫ్రాన్సిస్ 2013లో పోప్ అయ్యారు. ఈ 12 ఏళ్లలో ఫ్రాన్సిస్ యుద్ధాల వంటి అనేక ప్రపంచ సంక్షోభాలను చూశారు. ఆయన పోప్ అయిన వెంటనే 2014లో ఉక్రెయిన్ కు చెందిన క్రిమియాపై రష్యా యుద్ధానికి దిగింది. ఇక అనేక అంతర్యుద్ధాలు, సంక్షోభాలు. వీటిలో ప్రధానమైదని ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.
అయితే, దేశాధినేతల తరహాలో కాకుండా రష్యాను పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో రెచ్చగొట్టిందని, అందుకే ఉక్రెయిన్ యుద్ధం వచ్చిందని పోప్ ఫ్రాన్సిస్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. దీనిని ‘రష్యా గుమ్మంలో నాటో మొరిగింది’ అంటూ కాస్త కటువుగానే వ్యక్తం చేశారు. తద్వారా తప్పు ఎవరిదో ఆయన చెప్పకనే చెప్పారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఉక్రెయిన్ పట్ల ఆ దేశ ధోరణి చూశాక పోప్ మాటలు మరింత నిజం అనిపించాయి. ఏదేమైనా పోప్ తన చర్యలతోనే కాదు.. వ్యాఖ్యలతోనూ చరిత్రలో నిలిచిపోయారు.
