పొన్నెకల్లు గ్రామ సభ రద్దు...రీజన్ అదేనా ?
వారికి తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. దాంతో చేసేది లేక గ్రామ సభను రద్దు చేసుకుంటున్నట్లుగా అధికారులు ప్రకటించారు.
By: Tupaki Desk | 5 July 2025 6:49 PM ISTగుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని పొన్నెకల్లు గ్రామ సభ శనివారం రద్దు చేస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామ సభ ఎందుకు రద్దు అయింది అంటే అమరావతి రాజధాని కోసం రెండవ విడత భూ సమీకరణగా నలభై నాలుగు వేల ఎకరాలను తీసుకోవాలని సీఆర్డీయే నిర్ణయించింది.
అయితే దీనికి సానుకూలంగా కొన్ని గ్రామాలు ఉంటే వ్యతిరేకంగా మరికొన్ని గ్రామాలు ఉన్నాయి. అలా పొన్నకల్లు గ్రామంలో భూ సమీకరణ కోసం గ్రామ సభను నిర్వహిస్తే అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. తమ భూములను తమ గ్రామాన్ని భూసమీకరణ నుంచి పక్కన పెట్టాలని గ్రామ సభకు వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు. అంతే కాదు అధికారులతో సైతం వారు వాగ్వాదానికి దిగారు.
వారికి తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. దాంతో చేసేది లేక గ్రామ సభను రద్దు చేసుకుంటున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఆర్డీవో శ్రీవాస్ సహా ఇతర అధికారులు భూసమీకరణ మీద గ్రామస్తుల నుంచి ప్రజాభిప్రాయం కోసం సభను ఏర్పాటు చేశారు. అయితే తమ అభిప్రాయాలతో కాదు ఏకంగా గ్రామ సభనే రద్దు చేయాలని గ్రామస్తులు కోరడం విశేషం.
తమకు భూములను ఇవ్వడం ఇష్టం లేదని చాలా మంది రైతులు చెబుతున్నారు. మరో వైపు అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ కి చుట్టుపక్కన ఉన్న పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏకంగా 44 వేల ఎకరాల భూములను సేకరించాలని సీఆర్డీయే నిర్ణయించింది. భవిష్యత్తు అవసరాల కోసమే కాకుండా అమరావతి రాజధాని ప్రపంచ రాజధానిగా మారడానికి ఈ వేల ఎకరాల భూములు అవసరమని సీఆర్డీయే భావిస్తోంది
అయితే ఇక్కడ రెండు రకాల అభిప్రాయాలు రైతుల నుంచి వస్తున్నాయి. తమ భూములు ఇస్తామని కొన్ని గ్రామాల నుంచి రైతులు ముందుకు వస్తుంటే మరికొన్ని గ్రామాల రైతులు మాత్రం ససేమిరా ఇవ్వమని చెబుతున్నారు. దీంతో గ్రామ సభల వద్ద ఈ తరహా గందరగోళ పరిస్థితులు నెలకొంటునాయని అంటున్నారు.
మరో వైపు చూస్తే భూములు ఇవ్వమని చెప్పే రైతాంగానికి నచ్చచెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది అని అంటున్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఎంతవరకూ విజయవంతం అవుతాయో తెలియదు కానీ ఈ గందరగోళం మాత్రం కచ్చితంగా అధికారంలో ఉన్న కూటమి పెద్దలకు ఇబ్బంది కలిగించేదే అని అంటున్నారు ఏది ఏమైనా రెండో విడత భూ సమీకరణ నోటిఫికేషన్ తరువాత పొన్నకల్లు గ్రామం దానిని వ్యతిరేకిస్తూ సంచలనం సృష్టించింది. మరి పొన్నకల్లు బాటలో ఇంకెన్ని గ్రామాలు నడుస్తాయో చూడాల్సిందే అని అంటున్నారు.