Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ బై చెప్పిన పొన్నాల... ఎన్నాళ్లిలా ఉండాలా?

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్ తగిలిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 Oct 2023 11:06 AM GMT
కాంగ్రెస్‌  బై చెప్పిన పొన్నాల... ఎన్నాళ్లిలా ఉండాలా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి షాకిస్తారనేది కూడా చర్చనీయాంశం అయ్యింది. ఇందులో భాగంగా.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్ తగిలిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చోటుచేసుకుంటున్న వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో కాంగ్రెస్‌ పరువు పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని.. ఫలితంగా పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోందని.. గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని తెలిపారు. ఇక తనలాంటి సీనియర్ నాయకుడికే పార్టీ అంశాలు చర్చించడానికి అపాయింట్‌మెంట్ కోసం నెలలు తరబడి వేచిచూడడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

ఇలా... తాను బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక సీట్లు కేటాయించాలని కోరేందుకు సమయం ఇవ్వకపోవడం చాలా అవమానకరమని ఈ సందర్భంగా పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీలో ఉదయ్‌ పుర్‌ డిక్లరేషన్‌ అమలు జరగడం లేదని.. ఇక అవమానాలు ఎదుర్కొంటూ పార్టీలో ఉండటం తనవల్ల కాదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తాను చేసిన త్యాగాలను, కార్యక్రమాలను తలచుకొన్న పొన్నాల లక్ష్మయ్య... ఒక సీనియర్ పొలిటీషియన్ గా తాన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఇందులో భాగంగా... 2001లో తెలంగాణ కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపితే.. వారిలో మొదటి సంతకం పెట్టింది తానే అని తెలిపారు.

ఇక, రాష్ట్రంలో 18 ఏళ్లు మంత్రిగా అనేక శాఖలను నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో 40 ఏళ్లుగా పని చేసిన తనకే ఇంత అవమానం జరిగితే.. ఇక పార్టీలో సగటు బీసీ నేత పరిస్థితి ఊహిస్తేనే భయంగా ఉందని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... కొంత మంది వ్యక్తులు పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా... పార్టీని అమ్మకానికి పెట్టి ఒక వ్యాపార వస్తువుగా మార్చేశారని అంటూనే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూనే.. పొన్నాల చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అదేమిటంటే... "కాంగ్రెస్‌ పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది" అని! దీంతో... పొన్నాల రాజీనామా వెనుక అసలు కారణంపై ఒక క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు పరిశీలకులు!