మహిళలపై ఇవేం మాటలయ్యా మంత్రి.. ఆగ్రహంతో పార్టీ చర్యలు
మరోవైపు, డీఎంకే ఎంపీ కనిమొళి కూడా మంత్రి పొన్ముడి వ్యాఖ్యలను ఖండించారు.
By: Tupaki Desk | 11 April 2025 6:06 PM ISTతమిళనాడు అటవీశాఖ మంత్రి కె.పొన్ముడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన మహిళలను కించపరిచేలా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. గాయని చిన్మయి, నటి ఖుష్బూతో పాటు పలువురు ప్రముఖులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించగా సొంత పార్టీ డీఎంకే కూడా చర్యలు చేపట్టింది.
వివరాల్లోకి వెళితే, ఓ కార్యక్రమంలో మంత్రి పొన్ముడి సె*క్స్ వర్కర్లు, వారి కస్టమర్ల మధ్య సంభాషణను ప్రస్తావిస్తూ అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఇది కేవలం జోక్ అంటూ ఆయన మాట్లాడిన తీరు మహిళలను అవమానించేలా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ప్రశ్నిస్తూ, మంత్రి చేసిన వ్యాఖ్యల అర్థం ఏమిటని నిలదీశారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను ఆయన ఇంట్లోని మహిళలు అంగీకరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పొన్ముడిని మంత్రి పదవి నుంచి తప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. గాయని చిన్మయి సైతం తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి వారిని దేవుడే శిక్షిస్తాడని అన్నారు.
మరోవైపు, డీఎంకే ఎంపీ కనిమొళి కూడా మంత్రి పొన్ముడి వ్యాఖ్యలను ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, మహిళలపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. ఈ వివాదం పెద్దదవడంతో డీఎంకే పార్టీ వెంటనే స్పందించింది. పొన్ముడిని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకుంది.
కాగా, మంత్రి పొన్ముడి వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చడం విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై మద్రాసు హైకోర్టు ఆయనకు జైలు శిక్ష కూడా విధించింది. దీని కారణంగా ఆయన శాసనసభ్యత్వం కూడా రద్దయింది. అయితే, సుప్రీంకోర్టు ఆ శిక్షపై స్టే విధించడంతో ఆయన తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
మహిళలపై తాజాగా చేసిన అవమానకర వ్యాఖ్యలు మరోసారి పొన్ముడిని వివాదాల కేంద్రంగా నిలిపాయి. సొంత పార్టీ కూడా చర్యలు తీసుకోవడంతో ఈ అంశం ఎంతవరకు వెళుతుందో చూడాలి.
