Begin typing your search above and press return to search.

పోలింగ్ -కౌంటింగ్ .. 24 గంటల పైగా భరింపలేని విరహం

తెలంగాణ ఎన్నికలు ముగిసి దాదాపు 48 గంటలు అవుతోంది. ఇదే కాదు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల పోలింగ్ పూర్తయి కూడా 48 గంటలవుతోంది

By:  Tupaki Desk   |   2 Dec 2023 12:25 PM GMT
పోలింగ్ -కౌంటింగ్ .. 24 గంటల పైగా భరింపలేని విరహం
X

తెలంగాణ ఎన్నికలు ముగిసి దాదాపు 48 గంటలు అవుతోంది. ఇదే కాదు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల పోలింగ్ పూర్తయి కూడా 48 గంటలవుతోంది. తెలంగాణతో కాస్త అటుఇటుగా సమానంగా ఉండే ఛత్తీస్ గఢ్ లోనూ మనతో పాటే పోలింగ్ ముగిసింది. నక్సల్ ప్రభావిత రాష్ట్రం కావడంతో అక్కడ దశలవారీగా పోలింగ్ జరిపారు. ఇక ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలోనూ ఎన్నికలు జరిగాయి. వీటిలో మిజోరం మినహా మిగతా రాష్ట్రాల ఫలితాలు ఆదివారం ఉదయం వెలువడనున్నాయి. మిజోరం కౌంటింగ్ ను మరొక రోజు ముందుకు జరిపారు.

ఈసారి కాస్త నయమే..

తెలుగు రాష్ట్రాల్లో గత 20 ఏళ్లలో జరిగిన ఎన్నికలను లెక్కలోకి తీసుకుంటే.. ఫలితాల వెల్లడికి 2009లో అత్యంత ఎక్కువ సమయం పట్టింది. ఆ ఏడాది ఏప్రిల్ 16, 23 తేదీల్లో ఉమ్మడి రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మాత్రం మే 16న వచ్చాయి. అంటే తొలి దశ ఎన్నికలు పూర్తయిన నెల రోజులకు అన్నమాట. 2014లో ఏప్రిల్ 30, మే 7న ఎన్నికలు జరగ్గా.. మే 16న ఓట్లు లెక్కించారు. కాగా, ఆ తర్వాత ఏపీ రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే.

2018లో నాలుగు రోజులు..

తెలంగాణ ఏర్పాటయ్యాక కొలువుదీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లింది. ఇలా 2018లో డిసెంబరు 7న పోలింగ్ జరగ్గా 11న ఫలితలు వెలువడ్డాయి. అంటే నాలుగు రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం చూస్తే తెలంగాణలో నవంబరు 30న పోలింగ్ జరిగింది. ఫలితాలు డిసెంబరు 3న వెల్లడి కానున్నాయి. ఈ లెక్కన పోలింగ్ ముగిసినప్పటి నుంచి చూస్తే 70 గంటల పైగా సమయం అన్నమాట. ఇది గతంతో పోలిస్తే తక్కువే.

అభ్యర్థులకు ఒత్తిడి నుంచి రిలీఫ్

పోలింగ్- ఫలితాల వెల్లడికి తక్కువ సమయం ఉండడం ఒకందుకు అభ్యర్థులకు రిలీఫ్ గానే భావించాలి. అందులోనూ ఈవీఎంలను భద్రపరిచిన కేంద్రాల్లో లోపాలు ఉన్నాయంటూనో, ఇతరత్రా అక్రమాలకు పాల్పడుతున్నారంటూనో ఫిర్యాదులు చేసుకునేందుకు అవకాశం కూడా ఉండదు. అంటే.. ఆ చాన్సే రాదు. ఇక.. ఎలాగూ ప్రచారంలో చేసినంత చేశాం.. కాబట్టి ఎన్నికల ఫలితంపై దేవుడిదే నిర్ణయం అంటూ వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తానికి పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య ఉన్న సమయంలో అభ్యర్థులు తమకు గ్రామాల వారీగా వర్గాల వారీగా పడిన ఓట్లెన్ని? పట్టణాల్లో అయితే డివిజన్లు వార్డుల వారీగా పోలైనవి ఎన్ని..? పంపిణీ చేసిన డబ్బులు ఎన్ని..? ఎక్కడైనా నిలిచిపోయాయా? అందరికీ చేరాయా? మన అనుకున్నవారంతా ఓటేశారా? అని సరిచూసుకునే పనిలో ఉంటారనడంలో సందేహం లేదు. ఇక గెలుపునకు దగ్గరగా ఉన్నామని భావించేవారిలో మాత్రం ఫలితం ఏమవుతుందో అనే టెన్షన్ ఏర్పడుతుంది.

కుటుంబంతో గడుపుతూ.. యాత్రలకు వెళ్తూ

ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమించిన అభ్యర్థులు ఫలితాల వరకు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబ సభ్యులతో గడపడమో, విహార యాత్రలకు వెళ్లడమో చేస్తారు. ఎలాగూ నాయకులలో ఎక్కువ శాతం 50 ఏళ్లు పైబడిన వారు కావడంతో వారి కుటుంబాల్లో ఎదిగివచ్చిన పిల్లలు, పెద్ద వయసు తల్లిదండ్రులు ఉంటారు. వారి యోగక్షేమాలను ఎన్నికల హడావుడిలో పట్టించుకుని ఉండకపోవచ్చు. ఫలితాల ముందర దొరికిన లీజర్ లో అవన్నీ సరిచేసుకునే అవకాశం ఉంటుంది. కాగా, మిగతా నాలుగు పెద్ద రాష్ట్రాలకు ఫలితాలు పోలింగ్ పూర్తయిన 70 గంటల్లో వెల్లడవుతుండగా, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా కౌంటింగ్ చేపట్టనున్నారు.