Begin typing your search above and press return to search.

ఈ రాష్ట్రంలో ఎవరి 'ఉచితాల' వైపు ప్రజల మొగ్గు!

ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా అసెంబ్లీ సీట్లున్న మధ్యప్రదేశ్‌ (230)లో పోరు ఆసక్తి రేపుతోంది

By:  Tupaki Desk   |   11 Oct 2023 3:30 PM GMT
ఈ రాష్ట్రంలో ఎవరి ఉచితాల వైపు ప్రజల మొగ్గు!
X

శంలో కీలక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ఒకటి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌ తోపాటు తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా అసెంబ్లీ సీట్లున్న మధ్యప్రదేశ్‌ (230)లో పోరు ఆసక్తి రేపుతోంది. అందులోనూ ఇక్కడ రెండు ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ ల మధ్య పోటీ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ లో ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. దీంతో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుతారనేది ఆసక్తి రేపుతోంది.

మధ్యప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధానంగా ఎన్నికల పోరు సాగుతోంది. ఈసారి మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)తో పాటు అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా బరిలో ఉన్నా ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయం కోసం బీజేపీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, మాజీ సీఎం, పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌ శతథా ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దక్షిణాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగలడంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఆ పార్టీ వ్యవహరిస్తోంది. అందులోనూ వచ్చే ఏడాది వేసవిలో పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల ముందు జరిగే ఈ ఐదు రాష్ట్రాల మినీ ఫైనల్స్‌ లో విజయం సాధించాలని భావిస్తోంది.

మరోవైపు కర్ణాటకలో అధికారం సాధించిన కాంగ్రెస్‌ ఈ మ్యాజిక్కును ఐదు రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులంతా ప్రచారం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలు ప్రజలకు భారీగా ఉచిత పథకాల హామీలను ఇచ్చాయి. ఇందులో భాగంగా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే లాడ్లీ బెహనా యోజన కింద రాష్ట్రంలోని 1.32 కోట్ల మహిళలకు అందుతున్న నెలవారీ ఆర్థికసాయాన్ని ఏకంగా రూ.3,000కు పెంచుతామని పేర్కొంది. గత జూన్‌లో ఈ పథకాన్ని మొదలు పెట్టినప్పుడు ఈ సాయం తొలుత రూ.1,000 ఉండగా తర్వాత రూ.1,250కి, ఆ తర్వాత రూ.1,500కు పెంచారు. అలాగే రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని ప్రకటించారు.

ఇక కాంగ్రెస్‌ కూడా తక్కువేమీ తినలేదు. పీసీసీ అధ్యక్షుడు కమల్‌ నాథ్‌ కూడా ఇప్పటికే పలు ఉచిత పథకాలు ప్రకటించారు. మహిళలకు నారీ సమ్మాన్‌ నిధి’పేరుతో నెలకు రూ.1,500 అందజేస్తామని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికీ రూ.500కే ఎల్పీజీ సిలిండర్‌ అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏకంగా 45 శాతమున్న ఓబీసీలకు రిజర్వేషన్లను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచుతామని కమల్‌ నాథ్‌ హామీ ఇచ్చారు. వాస్తవానికి ఆయన సీఎంగా ఉండగా ఈ మేరకు నిర్ణయం తీసుకోగా కోర్టు దాన్ని కొట్టేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని కూడా ప్రకటించారు.

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి భక్తి బాట పట్టాయి. ఆలయాల పునర్నిర్మాణం, సుందరీకరణపై బీజేపీ సీఎం రూ.3,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ కూడా ఇటీవల జబల్‌ పూర్‌లో నర్మదా నది కార్యక్రమంలో పాల్గొన్నారు. జై నర్మద, జై భజరంగ బలి అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రజల మొగ్గు ఎవరి వైపు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.