Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ లౌకిక మాటలు చెప్పే వారు ఈ ప్రశ్నకు బదులేది?

హిందుత్వం గురించి.. హిందువుల గురించి మాట్లాడే వారంతా సమాజంలో చీలికలు తేవటమే లక్ష్యంగా పని చేస్తారన్నట్లుగా కొందరు వాదనలు వినిపిస్తారు

By:  Tupaki Desk   |   7 April 2024 5:03 AM GMT
ఎన్నికల వేళ లౌకిక మాటలు చెప్పే వారు ఈ ప్రశ్నకు బదులేది?
X

నోరు తెరిస్తే చాలు.. లౌకికవాదం.. మైనార్టీల సంక్షేమం గురించి పదే పదే మాట్లాడే రాజకీయ పార్టీలు.. నేతలందరిని ప్రజలు ఒక ప్రశ్నను సూటిగా అడగాల్సిన సమయం వచ్చేసిందంటున్నారు. హిందువులు.. హిందుత్వాన్ని.. సనాతన ధర్మాన్ని బూచిగా చూపే ప్రయత్నం చేస్తూ.. దాని గురించి మాట్లాడే వారిని సామాజిక ఉగ్రవాదుల తరహాలో అభివర్ణించటం.. వారిని ఎక్కెసం చేయటం.. వారి వాదనల్ని మూర్ఖత్వానికి నిలువెత్తు రూపంగా అభివర్ణించే మేధావులకు సామాన్యులు తమ సందేహాన్ని సూటిగా సంధించాల్సిందే.

హిందుత్వం గురించి.. హిందువుల గురించి మాట్లాడే వారంతా సమాజంలో చీలికలు తేవటమే లక్ష్యంగా పని చేస్తారన్నట్లుగా కొందరు వాదనలు వినిపిస్తారు. వామపక్ష భావజాలంతో పాటు.. లౌకిక వాదానికి అసలుసిసలు పరిరక్షకులం తామే అన్నట్లుగా ఫీలయ్యే వారి వాదనే నిజమని అనుకుందాం. మైనార్టీలకు ఉన్నట్లుగా మెజార్టీలకు ఎలాంటి హక్కులు ఉండవా? వారి ఆశలు.. ఆకాంక్షల గురించి మాట్లాడితే సామాజిక ఉగ్రవాదులుగా ఎందుకు అభివర్ణిస్తారు? సరే.. మాట్లాడే వారిని మాటలు అనేస్తున్నారు సరే. మరి.. మేధావులమన్న ట్యాగ్ లైన్ తో బతికేసేటోళ్లు మెజార్టీల గురించి తమ జీవిత కాలంలో ఏం మాట్లాడారు? వారి కోసం.. వారి తరఫున వారేం పోరాటాలు చేశారు? అన్న దాని గురించి అడగాల్సిందే.

హిందువులమని ఎవరైనా తమను తాము పరిచయం చేసుకొని.. తమ వర్గం సమస్యల గురించి.. తమకున్న భయాల గురించి.. తమ ఆందోళన గురించి మాట్లాడినంతనే అవహేళన చేసే వారిని సూటిగా ఒక ప్రశ్నను అడగాల్సిందే. అక్కడెక్కడో సదూర ఉన్న ఇజ్రాయల్ గురించి.. వారి కారణంగా తెగ అవస్థలకు గురి అవుతున్నారంటూ ముస్లింల గురించి.. వారి వేదన గురించి గుండెలు బాదేసుకునే మన మేధావులు.. ఆ దేశం తర్వాత మన దేశంలోని కశ్మీర్ వ్యాలీలో వేలాది హిందూ పండిట్లు తమ సొంత ప్రాంతం నుంచి దూరంగా పారిపోయే వైనం గురించి ఎందుకు మాట్లాడరు?

ఇజ్రాయల్ ఆరాచకం ఎంతంటే అంటూ మాట్లాడే వారు.. మన దేశానికి అనుకొని ఉండే పాకిస్థాన్.. బంగ్లాదేశ్ లో గడిచిన యాభై ఏళ్లలో హిందువుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది? అక్కడి హిందువులు పడుతున్న వేదనల గురించి వీరి నోరు ఎందుకు పెగలదు? అంతదాకా ఎందుకు? ఆఫ్ఘానిస్తాన్ లో గడిచిన వందేళ్ల కాలంలో తగ్గిన హిందువుల మాటేమిటి? అది కూడా సంబంధం లేని అంశంగానే అనుకుందాం. దేశంలోని భాగమైన కశ్మీర్ వ్యాలీలో గడిచిన ఐదు దశాబ్దాల్లో హిందువుల జనాభా ఎందుకు తగ్గిపోయింది?

దేశంలో మరే ప్రాంతంలో అయినా మైనార్టీలు.. వారున్న ప్రాంతంలో గడిచిన యాభై ఏళ్లలో తగ్గిపోయిన దాఖలాలు ఉన్నాయా? ఉంటే.. అలాంటి చోట్ల గురించి కాస్త చెప్పొచ్చు కదా? మైనార్టీల గురించి గుండెలు బాదేసుకునే మేధావులు.. మెజార్టీలుగా చెప్పబడుతూ మైనార్టీలుగా బతుకుతున్న హిందువుల గురించి మాట్లాడితే పాపంగా ఎందుకు అభివర్ణిస్తున్నారు? హిందువులు మనుషులు కాదా? వారికి ఎలాంటి భావోద్వేగాలు ఉండకూడదా? వారు ఎదుర్కొనే సమస్యలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదా? అన్నది ప్రశ్న. హిందువుల గురించి.. హిందుత్వ గురించి మాట్లాడే వారిని వేలెత్తేలా వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్కరిని నిలదీయాల్సిన సమయం వచ్చేసిందన్నది మర్చిపోకూడదు.