సలసల మరుగుతున్న 'సత్యవేడు' ఏం జరిగింది?
సత్యవేడు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులోని కీలకమైన ఎస్సీ అసెంబ్లీ నియోజవర్గం.
By: Tupaki Desk | 22 July 2025 9:52 AM ISTసత్యవేడు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులోని కీలకమైన ఎస్సీ అసెంబ్లీ నియోజవర్గం. ఇక్కడ కూటమి పార్టీల నాయకుల మధ్య జరుగుతున్న రాజకీయాలు భోగిమంటలను మించి సలసలా మరుగుతున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం వరుస విజయాలు దక్కించుకున్నారు. గతంలో కాంగ్రెస్ , తర్వాత.. వైసీపీ, 2024 ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన ఆదిమూలం వరుసగా గెలుస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన పరిస్థితి డోలాయమానంగా మారింది. ఎందుకంటే సొంత పార్టీ నుంచే ఆయనపై ఎగస్పార్టీ ఎదురవుతోంది.
సొంత నియోజకవర్గంలో తనను విస్మరించి.. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండా.. పొరుగు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు.. ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. అధికారిక కార్యక్రమాల నుంచి పార్టీ కార్యక్రమాల వరకు కూడా పొరుగు నియో జకవర్గాల ఎమ్మెల్యేలు పార్టిసిపేషన్ పెరిగిపోయింది. తాజాగా సత్యవేడు నియోజకవర్గం, నారాయణవనం మండల కేంద్రంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని నిర్వహించగా పొరుగు నియోజకవర్గం పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ పాల్గొన్నారు. అంతేకాదు.. ఈయన వెంట సత్యవేడు నియోజకవర్గం టిడిపి పోగ్రాం కో-ఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఉన్నారు.
నారాయణవనంలో శంకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మురళీమోహన్ ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అభివృద్ధి, సంక్షేమ పధకాలకు ప్రజలకు వివరించారు. వాటికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ పధకాలు అందాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏడాది కాలంలో దాదాపు 80% పూర్తి చేసిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. గత ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
సరే.. ఇదంతా ఇలా ఉంటే.. అసలు ఎమ్మెల్యే కోనేటి కి కనీస సమాచారం ఇవ్వకపోవడం.. అధికార కార్యక్రమాలకు కూడా ఆయనను పిలవకపోవడం గమనార్హం. దీనికి కారణం.. గత ఏడాది సెప్టెంబరులో టీడీపీకే చెందిన ఓ మహిళా నాయకురాలిపై రాసలీల వీడియో వెలుగు చూసింది. దీనిపై కేసు కూడా నమోదైంది. దీంతో కోనేటిని పక్కన పెట్టారు. కానీ.. ఈ కేసును తర్వాత.. సదరు మహిళ వెనక్కి తీసుకుంది. దీంతో కోనేటి ఈ కేసు నుంచి బయట పడ్డారు. కానీ.. పార్టీ అధిష్టానం చెప్పిందంటూ.. కోనేటి కి వ్యతిరేకంగా ఇక్కడ టీడీపీ నాయకులు చక్రం తిప్పుతున్నారు. గతంలో వైసీపీలో ఉన్న కోనేటితో అప్పట్లో విభేదించిన నాయకులే ఇప్పుడు ఇక్కడ అవకాశం అందిపుచ్చుకున్నారు. దీంతో కోనేటి వీరినై నిప్పులు చెరుగుతున్నారు. తాడేపేడో తేల్చుకుంటానని చంద్రబాబునే కలుస్తానని అంటున్నారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు సలసలలాడుతున్నాయి.
