Begin typing your search above and press return to search.

కవితకూ షర్మిలకూ ఫండ్స్ షార్టేజ్ !

రాజకీయం అంటే డబ్బుతోనే ఉంటుంది అడుగు తీసి అడుగు పెట్టాలీ అంటే డబ్బులు ఉండాలి. అపుడే కధ నడుస్తుంది. రాజకీయం ఏ మాత్రం అయినా పండుతుంది.

By:  Tupaki Desk   |   18 July 2025 6:00 PM IST
కవితకూ షర్మిలకూ ఫండ్స్ షార్టేజ్ !
X

రాజకీయం అంటే డబ్బుతోనే ఉంటుంది అడుగు తీసి అడుగు పెట్టాలీ అంటే డబ్బులు ఉండాలి. అపుడే కధ నడుస్తుంది. రాజకీయం ఏ మాత్రం అయినా పండుతుంది. మీడియాలో కనిపించాలన్నా జనం నోళ్ళలో నానాలన్నా తమ వెంట ఉండే ఆ నలుగురునీ తిప్పుకోవాలన్నా అంతా డబ్బుతో ముడిపడే ఉంటుంది. మరి అన్న చాటు చెల్లెళ్ళుగా ఉంటూ రాజకీయం అనే వట వృక్షంలో ఏ కొమ్మకో రెమ్మకో అల్లుకుని చల్లగా సాగిపోయే ఇద్దరు చెల్లెమ్మలకు ఇపుడు ఎండలో పడినట్లుగా పరిస్థితి మారింది.

ఇపుడు వారు తమను తాము రుజువు చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. సరే ఇది బాగానే ఉంది, ఆ మాత్రం పట్టుదల ఉండాలి, ఎదగాలని కోరిక కూడా ఉండాలి. కానీ రాజకీయాల్లో కొనసాగాలన్నా ఏమి చేయాలన్నా కూడా డబ్బు అతి ముఖ్యం కదా. అందుకే నిధుల కొరత ఆ ఇద్దరు చెల్లెమ్మలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అని అంటున్నారు.

ఆ ఇద్దరూ ఘనమైన రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న వారే. తండ్రులు దిగ్గజ నేతలు అన్నలు కూడా రాజకీయ వీరులే. కానీ ఆ ఇంట పూచిన చెల్లెమ్మలకు మాత్రం రాజకీయ వారసత్వం మీద మోజు ఉన్నా అది అంత సులువుగా దఖలు పడడం లేదు. అంది పుచ్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా అంతగా కలసిరావడం లేదు. చిటారు కొమ్మన ఉన్న మిఠాయి పొట్లాం చేతికి అందేదెపుడు అన్నదే చెల్లెళ్ళ ఆలోచన.

ఇక వైఎస్సార్ తనయగా జగన్న విడిచిన బాణంగా జనాలకు పరిచయం అయిన షర్మిల తీరు చూసినా కేసీఆర్ ముద్దుల కుమార్తెగా కేటీయార్ కి చెల్లెమ్మగా అయిన కవిత వైఖరి చూసినా రాజకీయం అనేది వారికి ఏ విధంగానూ సులభంగా కనిపించడంలేదు అని అంటున్నారు. రాజకీయం చేయాలంటే చాలా ఉండాలి మరి అంటున్నారు. ముఖ్యంగా ఫండ్స్ అవసరం అని చెబుతున్నారు.

ముందుగా షర్మిల ముచ్చటనే తీసుకుంటే జగనన్న చేతిలో దెబ్బ తిన్న చెల్లెమ్మగా ఉన్న షర్మిలకు జగన్ తో కయ్యం వల్ల పెద్ద ఎత్తున వచ్చే ఆస్తిని పోగొట్టుకుంది అని అంటున్నారు. తన ఆస్తి తనకు కావాలని అన్నతోనే ఆమె యుద్ధం చేస్తున్న నేపధ్యం ఉంది. దాంతో షర్మిలకు ఇపుడు నిధుల కొరత చాలా ఎక్కువగానే ఉంది అని అంటున్నారు అన్నకు ఎదురు నిలిచిన ఫలితంగా ఆమెకు ఆస్తుల విషయంలోనూ న్యాయం దక్కలేదని అంటున్నారు.

ఇక కవిత విషయం తీసుకుంటే ఆమెకు తండ్రి కేసీఆర్ ఉన్నారు కాబట్టి కొంతలో కొంత అడ్వాంటేజిగా ఉందని అంటున్నారు. అయితే ఆమె చేస్తున్న రాజకీయ చేష్టలు పోతున్న పోకడలతో కేసీఆర్ విసిగిపోయారని అంటున్నారు. దాంతో బీఆర్ఎస్ లో ఏ ఒక్కరి సపోర్టు కూడా కవితకు ఈ రోజున దక్కని వైనం కళ్ళ ముందే కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇంత చేసినా కేసీఆర్ కి కూతురు మీద అమితమైన ప్రేమ ఉందని అంటున్నారు. అందువల్ల ఆస్తుల విషయంలో కానీ మరో విషయంలో కానీ కేసీఆర్ అయితే అన్యాయం కవితకు చేయరనే అంటున్నారు. అయితే తన తండ్రి ప్రేమను అడ్డం పెట్టుకుని కవిత మరింతగా దూకుడు చేస్తే మాత్రం అది బీఆర్ఎస్ కి మరింతగా తలనొప్పిగా మారుతుంది అని అంటున్నారు.

ఇక అన్న కేటీఆర్ విషయం తీసుకున్నా ఆయన కూడా కవితకు పెద్దగా అన్యాయం చేసే పరిస్థితి లేకపోవచ్చు అని అంటున్నారు. దానికి కారణం కేసీఅర్ ఇంకా తన కుమార్తె వైపు ఉన్నారు, మద్దతుగా కూడా ఉన్నారని అంటున్నారు. అయితే కవిత ప్రతీసారీ ఏదో ఒక విమర్శ చేస్తూ బీఆర్ ఎస్ ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. అది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ బీఆర్ఎస్ కే తగులుతోంది అని అంటున్నారు. ఈ విధంగా కవిత ఎంత దూకుడు చేస్తే అంతగా ఆమెకూ బీఆర్ఎస్ కి నష్టమే అని అంటున్నారు.

అలా కనుక ముందు ముందు పరిణామాలు మరింతగా మారితే మాత్రం అపుడు కవితకు బీఆర్ఎస్ పూర్తిగా దూరం అవుతుంది, కేసీఆర్ సపోర్టు కూడా దక్కకుండా పోతుంది అని అంటున్నారు. అపుడు కవితకు కూడా నిధుల సమస్య ఎదురు కావచ్చు అని అంటున్నారు ఏది ఏమైనా రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలు అందుకోవాలని ఇద్దరు చెల్లెమ్మలూ ఆశిస్తూ ముందుకు రావడం వారి వరకూ సబబే అయినా ఎంచుకున్న దారుల వల్ల చేస్తున్న దూకుడు వైఖరి వల్ల అనుకున్నది సాధించడం మీదనే అందరికీ సందేహాలు వస్తున్నాయి. చూడాలి మరి తెలుగు నాట ఇద్దరు చెల్లెమ్మలూ రాజకీయంగా చెల్లని కాసులు అవుతారో లేక అన్ని విధాలుగా చలాయించే స్థాయికి చేరుకుంటారో.