నెహ్రూ నిర్మించిన చండీగఢ్ మీద మోడీ ఫోకస్
ఇపుడు దేశంలో కొత్త చర్చ సాగుతోంది. చండీగఢ్ నగరం విషయంలోనే ఆ చర్చ.
By: Tupaki Desk | 24 Nov 2025 2:00 AM ISTఇపుడు దేశంలో కొత్త చర్చ సాగుతోంది. చండీగఢ్ నగరం విషయంలోనే ఆ చర్చ. ఆందోళన. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలొ చండీగఢ్ పరిపాలనా నిర్మాణాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తోంది అన్న ప్రచారం అయితే సాగుతోంది. రాజ్యాంగ సవరణ ద్వారా చండీగఢ్ లో పాలనా పరమైన మార్పులు చేర్పులు పూర్తి స్థాయిలో చేయాలని కేంద్రం ఆలోచన చేస్తోంది అని ప్రచారంలో ఉంది. దీని మీద విపక్షాలతో పాటు పంజాబ్ సర్కార్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాంతో చండీగఢ్ విషయంలో ఎటువంటి బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశ్యం లేదని హోం మంత్రిత్వ శాఖ ఆదివారం స్పష్టం చేసింది. ఇంతకీ చండీగఢ్ మీద కేంద్రం ఫోకస్ ఎందుకు ఏమిటి ఈ సమయంలో ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు అన్నది చూస్తే ఆసక్తికరమైన అంశాలే ఉన్నాయి.
పూర్తి కేంద్ర పాలిత ప్రాంతంగా :
చండీగఢ్ ఇపుడు కేంద్రం ఆధీనంలో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నా పూర్తి స్థాయిలో అయితే కాదు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా నాగర్ హవేలి డామన్ డయ్యూ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు అనుగుణంగా చండీగఢ్‌ను సైతం కేంద్రం పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది అన్న చర్చ అయితే సాగుతోంది. దానికి త్వరలో జరగబోయే శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 కింద చండీగఢ్ ని తీసుకుని రావాలన్న ఆలఒచనలు జోరుగా సాగుతున్నాయని అంటున్నారు. అయితే కేంద్రం ఈ రకమైన కసరత్తు చేస్తోంది అన్న వార్తలు గుప్పుమనడంతో దీని మీద దేశంలో విపక్షాలు అన్నీ కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఆ పరిణామంతో రాజకీయ వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ అలాంటిది దేదీ లేదు అని స్పష్టం చేసింది.
కేంద్ర హోం శాఖ వివరణ :
ఇదిలా ఉంటే కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ కోసం కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని రూపొందించే ప్రక్రియను సరళీకృతం చేసే ప్రతిపాదన ఒక్కటి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని, అయితే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ ప్రతిపాదన చండీగఢ్ పరిపాలనా నిర్మాణాన్ని మార్చడానికి ఏ విధంగానూ ప్రయత్నించదని హోం శాఖ స్పష్టం చేసింది. అంతే కాదు చండీగఢ్ ని పంజాబ్ హర్యానా రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉమ్మడి రాజధానిగా ఉన్న ఈ సాంప్రదాయ ఏర్పాట్లను మార్చడం అసలు జరగదని కూడా కేంద్ర హోం శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాదు చండీగఢ్ మహా నగరం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ నగరానికి సంబంధించిన అన్ని వాటాదారులతో తగిన సంప్రదింపుల తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
ప్రతిపాదన ఇదేనా :
ఇదిలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్ డీయే ప్రభుత్వం చండీగఢ్ కేంద్ర భూభాగాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 కిందకు తీసుకురావాలని ప్రతిపాదించిందని చెబుతున్నారు. దీని వలన భారత రాష్ట్రపతి చండీగఢ్ నగరానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించి నేరుగా నిబంధనలను రూపొందించవచ్చు. అయితే ఈ ప్రతిపాదన పట్ల అనేక మంది రాజకీయ నాయకులు చండీగఢ్‌పై పంజాబ్ హక్కులపై దాడిగానూ అభివర్ణించారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అయితే మరో అడుగు ముందుకేసి కేంద్రం ప్రతిపాదనను తీవ్రంగా విమర్శించారు. దీనిని పంజాబ్ రాజధానిని కొల్లగొట్టడానికి చేసే కుట్రగానూ పేర్కొన్నారు. చండీగఢ్ పంజాబ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది, ఉంది ఎల్లప్పుడూ అది అలాగే ఉంటుందని ఆయన అన్నారు. మాతృ రాష్ట్రంగా పంజాబ్ కి చండీగఢ్‌పై పూర్తి హక్కులు ఉంటాయని ఆయన చెప్పారు ఈ విషయంలో కేంద్రం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కేంద్రం అధికారంలోకి :
చండీగఢ్ విషయంలో కేంద్ర ప్రతిపాదనలను పార్లమెంట్ ఆమోదం పొంది అమలులోకి వస్తే చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా గతంలో తన సొంత ప్రధాన కార్యదర్శిని కలిగి ఉన్నట్లే చండీగఢ్‌కు స్వతంత్ర నిర్వాహకుడిని నియమించడానికి కేంద్రానికి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. అందుకే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్రం ప్రతిపాదిత సవరణ పంజాబ్ గుర్తింపుని దాని రాజ్యాంగ హక్కులపైన జరిగిన ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు. అంతే కాకుండా కేంద్రం సమాఖ్య నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. చండీగఢ్ పంజాబ్‌కు చెందినదని ఆయన ప్రకటించారు.
నెహ్రూ కట్టిన నగరం :
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా రచ్చగా మారిన చండీగఢ్ ని తొలి ప్రధాని పండిట్ నెహ్రూ నిర్మించారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుసియర్ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా చండీగఢ్ నగరాన్ని నిర్మించారు. దేశ విభజన సమయంలో పంజాబ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది. అలా తూర్పు పంజాబ్ భారత్ లోకి వచ్చింది. మొత్తం పంజాబ్ కి లాహోర్ రాజధానిగా ఉండగా అది పాకిస్థాన్ కి వెళ్ళిపోయింది. దాంతో 1960 దశకంలో జరిగిన రాష్ట్రాల పునర్ విభజన తరువాత పంజాబ్ కి హర్యానాకు ఒక ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ ని నెహ్రూ నిర్మించి ఇచ్చారు అయితే దానిని తమకే పూర్తిగా ఇవ్వాలని పంజాబ్ కోరుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం చేస్తున్న కొత్త ప్రతిపాదనలు సెగలూ పొగలూ సృష్టిస్తోంది.
