Begin typing your search above and press return to search.

రాకోయి మాయింటికి.. నేత‌ల పాట్లు .. ఏపీ రాజ‌కీయంలో విచిత్రం...?

రావోయి మా ఇంటికీ.. అంటూ మీడియా ప్ర‌తినిధుల‌ను పిలిచి మ‌రీ ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన సంస్కృతి ఉన్న రాష్ట్రం మ‌నది.

By:  Tupaki Desk   |   14 April 2025 8:00 PM IST
Shift in Media-Politician Relationship in AP
X

రావోయి మా ఇంటికీ.. అంటూ మీడియా ప్ర‌తినిధుల‌ను పిలిచి మ‌రీ ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన సంస్కృతి ఉన్న రాష్ట్రం మ‌నది. అంతేకాదు.. పాత్రికేయులు అంటేనే స‌మున్న‌త గౌర‌వం ఇవ్వ‌డంతోపాటు.. వారికి అతిథి మ‌ర్యాద‌లు చేసిన సంస్కృతి కూడా ఉంది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. రావోయి మా ఇంటికీ.. అని అడిగి మ‌రీ ఇంటికి పిలిపించుకున్న నాయ‌కులు ఇప్పుడు రాకోయి మా ఇంటికీ అని వెంట‌బ‌డుతున్న పాత్రికేయుల‌ను కూడా ఇంటికి పంపేస్తున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం.

నాయ‌కుల విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసిన వారు ఉన్నారు. ప్ర‌జ‌ల కోసం ఆస్తులు అమ్ముకున్న పుచ్చ‌ల ప‌ల్లి వంటివారు కూడా ఉన్నారు. ఇక‌, ప్ర‌జ‌లే త‌న స‌ర్వ‌స్వంగా భావించిన క‌మ్యూనిస్టు దిగ్గ‌జ నాయ‌కులు కూడా ఉన్నారు. ఒక్క క‌మ్యూనిస్టులే కాదు.. కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీల్లోనూ అంతో ఇంతో ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసిన వారు ఉన్నారు. వీరంతా తాము చేసిన ప‌నుల‌ను వివ‌రించేందుకు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లేందుకు.. మీడియాను ఒక ఆయుధంగా వాడుకున్నారు. అందుకే అప్ప‌ట్లో పాత్రికేయుల‌కు బ‌ల‌మైన గౌర‌వం ల‌భించింది.

రానురాను ఇటు నాయ‌కుల్లోనూ.. ఇటు పాత్రికేయుల్లోనూ స‌మూల మార్పులు వ‌చ్చాయి. మా ఇంటికి వ‌స్తే.. మాకేం తెస్తావ్‌? మీ ఇంటికి వ‌స్తే.. మా కేం పెడ‌తావ్‌! త‌ర‌హా ప‌ద్ధ‌తి, విధానాలు పురుడు పోసుకున్నాయి. ఎక్క‌డికక్క‌డ స్వ‌లాభం చూసుకుంటు న్న నాయ‌కులు పెరిపోగా.. ఇంట‌ర్వ్యూ చేస్తే.. ఏమొస్తుంద‌న్న విధానంలో పాత్రికేయులు కూడా మిగిలిపోయారు. వీటికి తోడు వ‌క్రీక‌ర‌ణ‌లు, వ‌క్ర భాష్యాలు.. పెరిగిన ద‌రిమిలా.. ఇప్పుడు ఇంట‌ర్వ్యూలు అంటే.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఆ .. ఇప్పుడు వ‌ద్దులే! అని లైట్ తీసుకుంటున్నారు.

తాజాగా టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం 10 మాసాలు పూర్తి చేసుకున్న ద‌రిమిలా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ‌రూ కూడా ఇంట ర్వ్యూలు ఇచ్చేందుకు ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా.. వీరి ఇంట‌ర్వ్యూలు తీసుకునేందుకు కూడా పెద్ద మీడియా ఆస‌క్తి చూప‌లేదు. దీంతో ప్ర‌జ‌ల‌కు-నాయ‌కుల‌కు మ‌ధ్య వార‌ధిగా ఉన్న పాత్రికేయులు.. ఎక్క‌డో ఏదో కోల్పోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. పొగ‌డ్త‌.. లేక‌పోతే తెగ‌డ్త! అన్న చందంగా పాత్రికేయం మారిపోయిన ద‌రిమిలా.. ఇప్పుడు వ‌స్తామ‌న్నా.. ఇంట‌ర్వ్యూ చేస్తామ‌న్నా.. నాయ‌కులు రాకోయి మా ఇంటికీ అని త‌లుపులు వేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది!!.