కవితకు భారీ షాక్: హరీష్‌కే బీఆర్ ఎస్ మద్దతు
ఇదిలావుంటే.. కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ అగ్రనేతలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. సీబీఐ విచారణ అనేది రాజకీయ పరమైన అంశమని.. దీనిని అలానే ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధమవుతుందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 1 Sept 2025 9:10 PM ISTబీఆర్ ఎస్ కీలక నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి ఆయనే కారణమనిఆయన ఓపెన్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. సీఎం రేవంత్ రెడ్డి.. హరీష్‌రావు, సంతోష్‌లతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని.. సీబీఐ విచారణకు ఆదేశించారని.. అన్నారు. అంతేకాదు.. కేసీఆర్‌పై సభలో దాడి జరుగుతుంటే.. బీఆర్ ఎస్ నేతలు మౌనంగా ఉన్నారని అన్నారు.
అయితే.. కవిత ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే బీఆర్ ఎస్ నుంచి భారీ షాక్ ఎదురైంది. హరీష్ రావుకు అనుకూలంగా బీఆర్ ఎస్ వ్యాఖ్యలు చేసింది. `ఇది ఆరడుగుల బుల్లెట్టు.. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టారు`` అని మాజీ మంత్రి హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ ఎస్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో కవితకు తాము మద్దతు తెలపడం లేదన్నట్టు పరోక్ష సంకేతాలు ఇచ్చేసింది. దీనిని బట్టి కవిత పార్టీలో మరింత ఒంటరి అయ్యారన్న సంకేతాలు ఇచ్చినట్టు అయింది.
ఉంటే ఎంత.. పోతే ఎంత?
ఇదిలావుంటే.. కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ అగ్రనేతలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. సీబీఐ విచారణ అనేది రాజకీయ పరమైన అంశమని.. దీనిని అలానే ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధమవుతుందని చెబుతున్నారు. దీనిని అడ్డు పెట్టుకుని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. ``కేసీఆర్‌పై సీబీఐ విచారణ వేసిన తర్వాత.. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత?`` అని కవిత చేసిన వ్యాఖ్యలను సీనియర్లు తప్పుబడుతున్నారు. ఆమె చాలా హద్దులు దాటేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు.. తెలంగాణ బంద్‌కు ఎందుకు పిలుపు ఇవ్వలేదన్న విషయాన్ని కూడా తప్పుబడుతున్నారు. బంద్‌కు పిలుపు ఇస్తే.. ప్రభుత్వానికి తాము తలొగ్గినట్టు అవుతుంది కదా!? అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా కవిత పేల్చిన మాటల తూటాలను బీఆర్ ఎస్ దారి మళ్లించింది. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
