బీజేపీ మల్టీస్టారర్ పొలిటికల్ ప్లాన్!
దేశాన్ని 11 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీకి దక్షిణ భారతదేశంలో అనేక రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి.
By: Tupaki Desk | 2 April 2025 2:10 PM ISTఒకరికి మించి కథనాయకులు నటించే చిత్రాన్ని మల్టీస్టారర్ మూవీ అంటారు. అదే సంఖ్యలో కథా నాయకులు రాజకీయ నాయకులుగా చక్రం తిప్పితే.. డెఫినెట్ గా అది పొలిటికల్ మల్టీస్టారర్ గానే చెప్పాలి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో సినీ నటుల రాజకీయం బాగా పెరుగుతోంది. సినిమాలు, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉన్నా, నటీనటులు ఎవరికి వారే తమ రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ ఇద్దరు ప్రముఖ హీరోలతో దక్షిణ భారత్ లో తన రాజకీయ మనుగడను సుస్థిరం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు. కమలనాథులు రచిస్తున్న ఈ పొలిటికల్ మల్టీస్టారర్ వ్యూహం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.
దేశాన్ని 11 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీకి దక్షిణ భారతదేశంలో అనేక రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా దక్షిణాదికి చెందిన ఐదు ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో కాషాయ పార్టీకి సానుకూలత ఎదురవ్వడంలేదు. ఏపీలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు కేవలం 0.6 శాతంగానే నమోదవుతూ వస్తోంది. కర్ణాటకలో బలమైన ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీకన్నా ఆ పార్టీ నేత యడియూరప్ప ఇమేజ్ పైనే ఆధారపడాల్సివస్తోందనే వాదన ఉంది.
తెలంగాణలో బలపడేందుకు తీవ్ర పోరాటం చేస్తున్నా, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సివుంది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం పెద్దగా లేదనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ దక్షిణాదిలో విస్తరించేందుకు ఇద్దరు ప్రముఖ హీరోలపై ఆధారపడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆ ఇద్దరూ ఇప్పటికే రాజకీయాల్లో ఉండటం, ఆయా రాష్ట్రాల్లో ప్రధాన నేతలుగా గుర్తింపు తెచ్చుకోవడంతో వారిని ఉపయోగించుకుని దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
దక్షిణాదిలో బీజేపీ ఆశలు పెట్టుకున్న ఇద్దరు హీరోల్లో ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాగా, మరొకరు తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్. ప్రస్తుతం పవన్ బీజేపీ భాగస్వామిగా ఉన్నారు. ఆ పార్టీ సిద్ధాంతాలకు ప్రధాని మోదీకి గట్టి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం బీజేపీతో టచ్ మీ నాట్ అనే ధోరణి అనుసరిస్తున్నారు. తమిళనాడులో అధికార డీఎంకేని ఓడించి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తున్న టీవీకే పార్టీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. మరో ఏడాదిలో తమిళనాడు ఎన్నికలు జరగనుండగా, ప్రధాన పార్టీలు అన్నీ అప్పుడే రాజకీయ వ్యూహరచనలో జోరు చూపిస్తున్నారు.
ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న అన్నా డీఎంకే పార్టీ వచ్చే ఎన్నికల నాటికల్లా బీజేపీ, టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 5 శాతం ఓట్ల వ్యత్యాసం అన్నా డీఎంకే ఓడిపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలతో జట్టుకట్టి పోటీ చేస్తే ఓట్లు చీలిక లేకుండా చూసుకోవడమే కాకుండా, డీఎంకేని ఓడించవచ్చని అన్నాడీఎంకే వ్యూహంగా ఉంది. దీనికి బీజేపీ సహకారం కోరారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి. అయితే బీజేపీ మాత్రం తమిళనాడులో టీవీకే పార్టీ కూడా కలిసివస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
ఇటు పవన్, అటు విజయ్ ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలని కమలనాథులు వ్యూహం రచిస్తున్నారు. రాష్ట్రాల్లో పవన్, విజయ్ కి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చి, వారి మద్దతుతో ఎంపీ సీట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. అంతేకాకుండా పవన్, విజయ్ సినీ గ్లామర్ వల్ల దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవాలని కమలదళం భావిస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ ఆల్రెడీ లైనులోనే ఉన్నందున విజయ్ కోసం తీవ్ర మంత్రాంగం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీవీకే-బీజేపీ చేతులు కలిపితే తమిళనాడులో కూడా బోణీ కొట్టొచ్చనేది బీజేపీ పెద్దల అంతరంగంగా చెబుతున్నారు. మరి వారి ప్రణాళిక ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సివుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
