Begin typing your search above and press return to search.

వైఎస్‌ టు రూపానీ..హెలికాప్టర్‌, విమాన ప్రమాదాల్లో చనిపోయిన నేతలెందరో?

తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ సహా 200 మందిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   12 Jun 2025 7:47 PM IST
వైఎస్‌ టు రూపానీ..హెలికాప్టర్‌, విమాన ప్రమాదాల్లో చనిపోయిన నేతలెందరో?
X

కారు ప్రమాదానికి గురైతే.. అందులోని ప్రయాణికుల ప్రాణాలు దక్కేందుకు కాస్త అవకాశం ఉంటుంది.. రైలు ప్రమాదం జరిగినా ప్రయాణికులు బతికేందుకు అవకాశం ఉంటుంది. కానీ, విమానమో.. లేదా హెలికాప్టర్‌ దుర్ఘటనో జరిగితే మాత్రం చాలావరకు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే..!

తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ సహా 200 మందిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రూపానీ మాత్రమే కాదు..భారత దేశంలో చాలామంది నాయకులు విమాన, హెలికాప్టర్‌ దుర్ఘటనల్లో చనిపోయారు. వీరిలో మనందరినీ బాగా బాధించిన ఘటన.. ప్రజా నాయకుడిగా తిరుగులేని ఆదరణ ఉన్న ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిది.

-2009 సెప్టెంబరు 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ.. ప్రతికూల వాతావరణంలో కర్నూలు జిల్లాలో వైఎస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. పావురాల గుట్ట అడవుల్లో జరిగిన ఈ దుర్ఘటన తెలుగు రాజకీయాలనే మార్చేసింది.

-వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకముందే.. 2011 ఏప్రిల్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండు కూడా హెలికాప్టర్‌ దుర్ఘటనలో చనిపోయారు. తవాంగ్‌ నుంచి ఈటానగర్‌ వస్తుండగా ఖండూ దుర్మరణం పాలయ్యారు.

-2001లో కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తండ్రి మాధవరావు సింథియా ఢిల్లీ నుంచి కాన్పూర్‌ వెళ్తుండగా.. విమానం కుప్పకూలడంతో విగతజీవిగా మారారు.

-అమలాపురం నుంచి లోక్‌సభ స్పీకర్‌గా అత్యున్నత రాజకీయ పదవికి ఎదిగిన జీఎంసీ బాలయోగి 2002లో ఢిల్లీకి వెళ్తూ హెలికాప్టర్‌ కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.

-దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు, ప్రొఫెషనల్‌ పైలట్‌ అయిన సంజయ్‌గాంధీ 1980 జూన్‌ 23న సఫ్దర్‌ జంగ్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కాసేపటికే విమానం కూలడంతో చనిపోయారు.

-2005లో హరియాణా మంత్రిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.

-1995లో హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం సురేంద్రసింగ్‌ కూడా హెలికాప్టర్‌ కూలడంతో చనిపోయారు.

-గుజరాత్‌కే చెందిన మాజీ సీఎం బల్వంతరాయ్‌ మెహతా 1965లో విమానం కూలడంతో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇది మరో రకం దుర్ఘటన. అప్పట్లో పాకిస్థాన్‌తో యుద్ధం జరుగుతుండగా ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌ కూల్చివేసింది.