తిట్ల పురాణం కట్టడి చేసే చట్టం...ఏపీకి అవసరమా ?
రాజకీయ నాయకులు అంటే పూర్వం సేవా భావంతో ఉండేవారు. పైగా హుందాగా వ్యవహరించేవారు.
By: Tupaki Desk | 18 July 2025 8:00 PM ISTరాజకీయ నాయకులు అంటే పూర్వం సేవా భావంతో ఉండేవారు. పైగా హుందాగా వ్యవహరించేవారు. ఒక ప్రజా సమూహానికి ప్రాతినిధ్యం వహించే నాయకులుగా వారు తమను భావించుకునే వారు. అందుకే పది మందీ తమను చూస్తున్నారని తాము ఏమి చేసినా దానిని వారు ఆదర్శంగా తీసుకుంటారని కడు జాగ్రత్తగా వ్యవహరించేవారు.
దాంతో ఆనాటి చట్టసభలు అందంగా సాగేవి. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కూడా వినసొంపుగా ఉండేవి. ఇక సాహిత్యాన్ని పురాణాలను ఇతర అంశాలను ప్రస్తావనకు తెచ్చి మరీ తన ప్రసంగాలకు అందం అద్దేవారు. సభలో విపక్షాలకు ఎక్కువ మాట్లాడే అవకాశం ఇస్తే తమ పరిపాలనకు ఎక్కువ సలహాలు సూచనలు వస్తాయని అధికార పక్షం భావించే రోజులు అవి.
సభ్యులు చేసుకునే విమర్శలలో కూడా సున్నితమైన హాస్యం వ్యంగ్యోక్తులు ఉండేవి. అయితే ఇపుడు అసెంబ్లీ లోపలా బయటా కూడా దారుణమైన భాష వాడేస్తున్నారు. ఏది అనాలో ఏది అనకూడదో కూడా హద్దులు పెట్టుకోవడం లేదు. అదేదో సినిమాలో హీరో అంటాడు జనాల మీద సినిమాల ప్రభావం చాలా ఉంది అని. కానీ రాజకీయ జీవుల మీద పంచు డైలాగుల ప్రభావం అయితే చాలానే ఉంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే వర్తమానంలో చాలా మంది నాయకులు వాడుతున్న భాష చూస్తే జనాలు సైతం ఏహ్యభావం పెంచుకుంటున్నారు. ఇందులో వారూ వీరూ అని ఏమీ లేదు, మైకు ఎవరి చేతిలలో ఉంటుందో వారు అని అనుకోవడం సబబు. మరి ఇలాంటి వారిని కట్టడి చేయడం ఎలా అంటే దానికే ఎవరికీ జవాబు తట్టడం లేదు. బాబోయ్ అని చెవులు మూసుకోవడమే జనాల వంతు అవుతోంది.
అయితే ఈ తరహా పరుష పదజాలానికి అడ్డుకట్ట వేయడానికి ఒక పరిష్కారం ఉందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు. ఆయన రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాటలు మాట్లాడకుండా నియంత్రించేందుకు ఒక చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ నాయకులు హుందాగా రాజకీయాలు నిర్వహించకుండా వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ మాట్లాడటానికి వీలు లేని పరుష పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పైగా తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా నాయకులు అంటున్నారని ఆయన ఎత్తి చూపారు. తప్పులు చేసిన వారి మీద కేసులు పెట్టకూడదా అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో రానున్న శాసనసభ సమావేశాలలో శాసనసభ్యులు ప్రతిపక్ష నాయకులు ఎవరూ కూడా పరుష పదజాలం ఉపయోగించకుండా, వినటానికి వీలు లేని భాషను వాడకూడదని చట్టం చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. మరి యార్లగడ్డ ప్రతిపాదన బాగుంది. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఒక చట్టాన్ని చేస్తుందా అన్నది చర్చగా ఉంది.
ఇక చట్టం చేసినా దానిని పాటించేవారు ఉన్నారా అన్నది మరో ప్రశ్న. ఏది ఏమైనా భాష బాగులేదని అంతా అంగీకరిస్తున్నారు తాము మాత్రం మైకుల ముందుకు వచ్చి ఆవేశంతో ఊగిపోతున్నారు. దీనిని స్వీయ నియంత్రణకు మించిన పరిష్కారం లేదు. కానీ అది జరిగేపనేలా. ఏపీ లాంటి చోట్ల అసలు కుదిరే పనేనా అన్నదే చర్చగా ఉంది.
