ఈ సారైన అవకాశం వస్తుందా.. ఏపీలో వారసుల పాట్లు.. !
రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన.. అవకాశాలు వస్తాయా? అంటే.. కష్టమేనని చెప్పాలి.
By: Tupaki Desk | 19 July 2025 9:00 AM ISTరాజకీయాల్లో ఉన్నంత మాత్రాన.. అవకాశాలు వస్తాయా? అంటే.. కష్టమేనని చెప్పాలి. సుదీర్ఘకాలంగా రాజ కీయాల్లో ఉన్న చాలా కుటుంబాలకు చెందిన వారసులు టికెట్లు తెచ్చుకోవడంలోనూ.. ఒకవేళ తెచ్చుకు న్నా గెలుపు గుర్రం ఎక్కడంలోనూ తడబడుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి అందరి టార్గెట్ ఇప్పుడు 2029 ఎన్నికలే. ఆ ఎన్నికల్లో అయినా.. తమకు టికెట్ దక్కుతుందా? అని కొందరు ఎదురు చూస్తే.. టికెట్ దక్కినా.. గెలుస్తామా? అని మరికొందరు వేచి ఉన్నారు.
ఉదాహరణకు కొందరి విషయం చూద్దాం..
1) పరిటాల శ్రీరాం: దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పరిటాల కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబానికి చెందిన యువ నాయకుడే.. పరిటాల శ్రీరాం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనే ఆయన టికెట్ ఆశించారు. కానీ, దక్కలేదు. పైగా.. ఆయన ఆశించిన ధర్మవ రం అసలే చిక్కలేదు. ఇప్పుడు ఈయన వచ్చే ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ, పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇప్పటి వరకు రాలేదని అంటున్నారు.
2) దేవినేని అవినాష్: పార్టీలు మారినా.. తనదైన శైలితో రాజకీయాలు చేయడంలో దేవినేని అవినాష్ ముందున్నారు. కాంగ్రెస్-టీడీపీ నుంచి బయటకు వచ్చిన.. అవినాష్.. వైసీపీలో చేరారు. గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరఫున తనకు నచ్చిన ఇష్టమైన నియోజకవర్గం విజయవాడ తూర్పు నుంచే పోటీ చేశారు. కానీ.. పరాజయం మూటగట్టుకున్నారు. నిజానికి.. ఈయనపై మరో మాట కూడా ..ఉంది. రాజకీయంగా ఐరెన్ లెగ్ అంటారు. సో.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా? అనేది ఈయన సందేహం కూడా.
3) నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి: నెల్లూరు జిల్లారాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేక స్థానం గుర్తింపు తెచ్చుకున్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మిల వారసుడు.. రాం కుమార్. గత ఏడాది తొలిసారి వైసీపీ తరఫున వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, పరాజయం పాలయ్యారు. ఈయన కొంత మేరకు ప్రజల్లో ఉన్నా.. గెలిచేంత ఊపైతే రావడం లేదని స్థానికంగా వినిపిస్తున్న మాట. మరి వచ్చే ఎన్నికలపై చాలానే ఆశలు పెట్టుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితిలో అసలు టికెట్ దక్కుతుందా? అనేది సందేహంగా ఉందట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
4) కావలి గ్రీష్మ: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కావలి ప్రతిభా భారతి కుమార్తెగా రాజకీయాలలోకి వచ్చిన ఫైర్ బ్రాండ్ నాయకురాలు గ్రీష్మ. గత ఏడాది ఎన్నికల్లోనే టికెట్ ఆశించినా.. రాజాంలో ఉన్న రాజకీయాల కారణంగా దక్కలేదు. ఇక, చంద్రబాబు చలవతో మండలిలోకి వచ్చారు. కానీ, మనసు మాత్రం ఎమ్మెల్యే టికెట్‌పైనే ఉందని తెలుస్తోంది. మరి ఆమెకు ఆ చాన్స్ దక్కుతుందా? దక్కినా గెలుస్తారా? అనేది చూడాలి.
5) వంగవీటి రాధా: రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా.. 2004లో సింగిల్ టైమ్ ఆయన విజయ వాడ తూర్పు నుంచి విజయం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు మళ్లీ ఆయనకు విజయం దక్కలేదు. 2024 లో అసలు టికెట్ కూడా లభించలేదు. మరి ఈయన వచ్చే ఎన్నికలపై ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే.. టీడీపీ నుంచి బయటకు రావాలని చూస్తున్నారట. ఇదీ.. సంగతి!!
