గట్టిగా మాట్లాడితే లోపలేస్తారు.. మాజీ మంత్రి సిదిరిలో భయం
గత ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించిన నేతల్లో వల్లభనేని వంశీ, పోసాని ఇప్పటికే అరెస్టు కాగా, నెక్ట్స్ వీరేనంటూ చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 13 March 2025 11:00 PM ISTకూటమి ప్రభుత్వ యాక్షన్ వైసీపీ నేతలను బాగా భయపెడుతోందా? అంటే ఆ పార్టీ నేతల తీరు చూస్తే ఔను అనే చెప్పాల్సివస్తోందని అంటున్నారు. నేతల వరుస అరెస్టులతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం హడలిపోతున్నారని అంటున్నారు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోననే టెన్షన్ తో పెదవి విప్పేందుకు నిరాకరిస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో నోటి దురుసు చూపిన నేతలు ఇప్పుడు నో కాంట్రవర్సీ అంటూ దండం పెట్టేస్తున్నారు. వైసీపీ కీలక నేతలు వల్లభనేని వంశీ, పోసాని క్రిష్ణమురళి, నందిగం సురేశ్, బోరుగడ్డ అనిల్ తోపాటు సోషల్ మీడియా కేసుల్లో వందల మంది కార్యకర్తల అరెస్టు ఎఫెక్ట్ తో మరికొందరు సైలెంటుగా ఉంటున్నారని అంటున్నారు.
గత ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించిన నేతల్లో వల్లభనేని వంశీ, పోసాని ఇప్పటికే అరెస్టు కాగా, నెక్ట్స్ వీరేనంటూ చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్ కే రోజా, పేర్ని నాని, జోగి రమేశ్ వంటివారిని ఏ కేసులో అయినా అరెస్టుచేసే అవకాశం ఉందని టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సైతం నోటి దురుసుగా వ్యవహరించేవారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పలాస ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీషను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో సిదిరిపై ప్రస్తుతానికి మూడు కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో అరెస్టుల పర్వం కొనసాగించడంతో సిదిరి కూడా కాస్త వెనక్కి తగ్గారంటున్నారు. అధికారంలో ఉండగా, జోరుచూపించిన సిదిరి అప్పలరాజు ఇప్పుడు ఏం మాట్లాడినా, పట్టుకుని లోపలేస్తారంటూ జంకుతున్నారు.
ఇటీవల ఓ టీవీ చానల్ కి ఇంటర్వూ ఇచ్చిన మాజీ మంత్రి సిదిరి తాను గట్టిగా మాట్లాడితే పట్టుకుని లోపలేస్తారంటూ వ్యాఖ్యానించడం వైరల్ అవుతోంది. గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై మూడు కేసులు నమోదు కావడంతో ఆయనలో అరెస్టు భయం కనిపిస్తోందంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిదిరి అప్పలరాజు తొలిసారి గెలివగా, 2019లో మంత్రి పదవి ఇచ్చారు అప్పటి సీఎం జగన్. అధినేత ఆశీస్సులతో తొలిసారే మంత్రి పదవి దక్కిందనే ఆనందంతో అప్పట్లో సిదిరి మంచి హుషారుగా ఉండేవారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో నేత దువ్వాడ శ్రీనివాస్ తో పోటీగా అప్పటి ప్రతిపక్షంపై విరుచుకుపడేవారని చెబుతున్నారు. ప్రస్తుతం కూటమి ఒక్కో నేతను టార్గెట్ చేస్తుండటం వల్ల సిదిరిలోనూ భయం కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్నే ఆయనే నేరుగా అంగీకరించారని ఓ వీడియో వైరల్ అవుతుండటం గమనార్హం.
