రాజకీయ చర్చలు.. చెరపలేని మచ్చలు ..!
రాజకీయాలు అంటే అందరికీ ఆసక్తి. సినిమాల కంటే కూడా.. రాజకీయాలపై నే నేటి యువత కూడా ఎక్కువ ఆసక్తి చూపుతోంది.
By: Tupaki Desk | 9 Jun 2025 9:47 AM ISTరాజకీయాలు అంటే అందరికీ ఆసక్తి. సినిమాల కంటే కూడా.. రాజకీయాలపై నే నేటి యువత కూడా ఎక్కువ ఆసక్తి చూపుతోంది. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే.. 2024 ఎన్నికల సమయానికి యూత్ ఓటర్లు ఎక్కువగా కదిలి ముందుకు వచ్చారు. అంటే.. రాజకీయాలపై పెరుగుతున్న ఆసక్తిని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఇక, రాజకీయంగా ఉదయం పూట పలు టీవీల్లో చర్చలు జరుగుతుంటాయి. వీటిని కూడా లక్షలాది మంది వీక్షిస్తుంటారు.
ఆయా చానెళ్లకు రాజకీయ చర్చలు బ్రాండ్‌గా కూడా మారిపోయాయి. వాటి కోసం వేచి చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది. అంతేకాదు.. టీఆర్‌పీ రేటింగ్ కూడా భారీగానే ఉంది. దీంతో చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యం కూడా పెంచారు. మేధావి వర్గాలను ఒకప్పుడు ఈ చర్చలకు ఆహ్వానిస్తే.. ఆ తర్వాత.. రాజకీ య నేతలు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చర్చలకు వస్తున్నారు. అయితే.. సాధారణంగా చర్చలు మరింత సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఉప కరించాలి.
లేదా.. రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతను తగ్గించేలా ఉండాలి. మీమాంసలకు పరిష్కారాలు చూపించే లా.. ప్రజలను చైతన్య పరిచేలా ఆలోచింపజేసేలా కూడా ఇవి ఉండాలి. అయితే.. రాను రాను.. రాజకీయ నేతల ప్రభావం ఎక్కువగా పడుతోంది. పార్టీల పరంగా చీలిపోయిన చానెళ్ల కారణంగా.. ఈ చర్చలు కూడా రాజకీయ పరంగా చీలిపోయాయి. తమ వారిని ఎంత పొడిగితే అంత సేపు మాట్లాడనిస్తారన్న ధోరణి పెరిగింది. అదేవిధంగా ఎదుటి వారిని ఎంత విమర్శిస్తే.. అంత సేపు తమకు అవకాశంఇస్తారన్న ధోరణి కూడా ఉంది.
ఈ రెండు కారణాలతో రాజకీయ చర్చలు దారి మళ్లాయి. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు నోరు చేసు కుంటున్నారు. వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాబట్టి.. తాము కూడా.. అంతకు మించిన వ్యతిరేకత చూపి తే.. తమకు మాట్లాడే అవకాశం వస్తుందన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇది రాజకీయ నాయకులు చేస్తే వేరేగా ఉండేది. కానీ, జర్నలిస్టులే ఇలా దారి తప్పి.. ప్రాపు కోసం ప్రయత్నం చేయడం వంటివి పెరిగిపోయాయి. స్టూడియోల్లోనే చెప్పులతో కొట్టడం.. ఒకరిపై దూషణలకు దిగడం.. ఇప్పుడు అమరావతి మహిళలను దూషించడం.. వంటివి రాజకీయ చర్చలకు మచ్చలుగా మిగిలిపోతున్నాయి.