Begin typing your search above and press return to search.

పదేళ్లలో గులాబీ సర్కారు వేలం వేసింది ఎన్ని ఎకరాలంటే?

కంచ గచ్చిబౌలిలో టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కు చెందిన 400 ఎకరాల భూముల్ని అమ్మే విషయంలో జరుగుతున్న రచ్చ తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 April 2025 12:00 PM IST
Political Clash Over Gachibowli Land Sale
X

కంచ గచ్చిబౌలిలో టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కు చెందిన 400 ఎకరాల భూముల్ని అమ్మే విషయంలో జరుగుతున్న రచ్చ తెలిసిందే. ఈ భూముల వేలాన్ని అడ్డుకునేందుకు విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఒకవేళ ఈ భూముల్ని ప్రభుత్వం వేలం వేస్తే.. తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాన్ని రద్దు చేస్తామని.. అందుకే వాటి జోలికి ఏ సంస్థ రావొద్దంటూ బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ చేసిన హెచ్చరిక పెను సంచనలంగా మారింది.

తెలంగాణలో ఈ తరహా హెచ్చరికలు ఇదే తొలిసారి. కేటీఆర్ వార్నింగ్ కొత్త చర్చకు తెర తీసినట్లైంది. పదేళ్ల కేసీఆర్ సర్కారులో ఇదే సంస్థకు చెందిన భూముల్ని వేలం వేశారా? వేస్తే ఎంత వేశారు? ఎంత ఆదాయం వచ్చింది? లాంటి ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో టీజీఐఐసీ యాజమాన్యంలో ఉన్న భూములు ఎన్ని అన్న అంశంపైనా చర్చ జరుగుతోంది.

ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడు వచ్చే సమాచారం ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికి కలిగించేలా ఉండటం విశేషం. దేశంలోనే అత్యధిక పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్ ఈ సంస్థ సొంతంగా చెప్పొచ్చు. దేశంలోని ఇతర సంస్థలతో పోలిస్తే.. టీజీఐఐసీ వద్ద అత్యధికంగా 1.5 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నట్లుగా తేలింది. ల్యాండ్ బ్యాంక్ పరంగా చూస్తే తెలంగాణ తర్వాత స్థానంలో మహారాష్ట్ర వద్ద 48,437 ఎకరాలు.. తమిళనాడు వద్ద 48,198 ఎకరాలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఏపీ.. గుజరాత్..కర్ణాటక.. ఉత్తరప్రదేశ్.. రాజస్తాన్.. మధ్యప్రదేశ్.. హర్యానా రాష్ట్రాల పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థల వద్ద గణనీయమైన ల్యాండ్ బ్యాంక్ ఉన్నట్లుగా చెప్పొచ్చు.

ఇక.. టీజీఐఐసీ వద్ద ఉన్న భూముల్ని పదేళ్ల కేసీఆర్ సర్కారు అమ్మిందా? అంటే.. ఎందుకు అమ్మలేదన్న సమాధానం వెంటనే వస్తుంది. నిధులు అవసరమైన ప్రతిసారీ పారిశ్రామిక అభివ్రద్ధి పేరుతో వేలం వేసిన వైనం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన గులాబీ సర్కారు తాను పాలించిన మొత్తం పదేళ్ల కాలంలో (తొమ్మిదిన్నరేళ్లు అనుకోండి) టీజీఐఐసీ భూముల వేలం ప్రక్రియ ద్వారా సమకూర్చుకున్న ఆదాయం అక్షరాల రూ.21వేల కోట్లుగా చెప్పాలి.

టీజీఐఐసీ సంస్థ కొన్నిసార్లు సొంతంగా.. మరికొన్ని సందర్భాల్లో హెచ్ఎండీఏ తో కలిసి భూముల వేలాన్ని వేసింది. 2014 నుంచి 2023 మధ్య కాలంలో ఈ సంస్థలు వివిధ సందర్భాల్లో 811 ఎకరాల్ని వేలం వేసింది. ఇందులో కొన్ని ప్రైవేటు సంస్థలకు కేటాయింపులు జరిపింది. కోకాపేట.. ఖానామెట్ లో భూముల్ని వేలం ద్వారా కేసీఆర్ సర్కారు అప్పట్లో రూ.10వేల కోట్లు సమకూర్చుకోవటం తెలిసిందే.

ఇదే బాట పట్టింది రేవంత సర్కారు. కంచ గచ్చిబౌలి సర్వే నెంబరు 25(పి)లో ఉన్న 400 ఎకరాల్ని తనఖా పెట్టిన సర్కారు రూ.10వేల కోట్ల రుణ సమీకరణ చేపట్టింది. రైతు భరోసా ఇచ్చేందుకు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఆ తాకట్టులో ఉన్న భూముల్ని డెవలప్ చేసి వేలం ద్వారా రూ.20 వేల నుంచి రూ.30వేల కోట్ల మేర నిధులు సమకూర్చుకోవాలన్న ఆలోచన చేసింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జరిగిన పోరాటం గురించి అందరికి తెలిసిందే. ఇక్కడో పాయింట్ ప్రస్తావించాలి. పదేళ్ల పాలనలో 811 ఎకరాల్ని ఎలాంటి వివాదం తెర మీదకు రాకుండా అమ్మేసిన కేసీఆర్ సర్కారు.. అందుకు భిన్నంగా రేవంత్ సర్కారు వేలాన్ని అడ్డుకుంటున్న తీరు.. చేస్తున్న హెచ్చరికలు చూస్తే.. ఇది కదా రాజకీయం అని అనుకోకుండా ఉండలేం.