రాజకీయ జ్యోతులు: మనసులో ఒకటి.. బయటకు మరొకటి..!
రాజకీయాలంటే.. రాజకీయాలే! మనసులో ఒకటి ఉంటుంది.. బయటకు ఒకటి చెబుతారు.
By: Tupaki Desk | 20 April 2025 3:00 PM ISTరాజకీయాలంటే.. రాజకీయాలే! మనసులో ఒకటి ఉంటుంది.. బయటకు ఒకటి చెబుతారు. ఈ విషయంలో సీనియర్లను మించి న నాయకులు లేరు. ఇటీవల టీడీపీ సీనియర్ నాయకుడు యనమలరామకృష్ణుడు అయినా.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అయినా.. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ అయినా.. అందరిదీ ఒకే దారి. అందరిదీ ఒకటే కోరిక. అదే పదవులు! తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూనే.. తమ మనసులో కోరికను బయట పెట్టారు యనమల. తనకు రాజ్యసభ తప్ప.. ఇతర పదవులపై ఆసక్తిలేదని కొంత బలంగానే చెప్పుకొచ్చారు.
ఇక, జేసీ ప్రభాకర్‌రెడ్డికూడా దాదాపు ఇదే పాట పాడారు. బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డితో ఏర్పడిన వైరం నేపథ్యంలో చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ఆయనపై పొగడ్తల జల్లు కురిపించారు. ప్రస్తుతం తాడిపత్రి మునిపల్ చైర్మన్‌గా ఉన్న జేసీ.. ఫ్లైయాష్ విషయంలో ఆదితో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మనసులో ఉన్నది బయట పెట్టుకుండా.. పరోక్షంగా ప్రతిపక్ష పాత్రపోషించారు. ఈ క్రమంలోనే ఉచిత బియ్యాన్ని ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఇతర అంశాలను కూడా ప్రస్తావించారు.
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం.. గత ఏడాది డిసెంబరులో పెద్ద ఎత్తున హైలెట్ అయింది. దీనిని ప్రస్తావిస్తూ.. ఆ కేసులు ఏమయ్యాయో.. ఆ ఏడుకొండలవాడికే తెలుసునని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అసలు ఒక్క రూపాయికేరేషన్ బియ్యం ఇవ్వమనిఎవరు అడిగారని.. 30 రూపాయలకు ప్రభుత్వం కొని.. ఒక్క రూపాయికి ఇవ్వడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఇవన్నీ.. సర్కారుకు ఇబ్బందికర పరిణామాలేనని ఆయనకు కూడా తెలుసు. పైగా.. ఇప్పుడు ప్రభుత్వంపై పాజిటివిటీ అంతో ఇంతో పెరుగుతున్న క్రమంలో ఇలాంటివి రేపడం వెనుక వుద్దేశం వేరుగా ఉంది.
గతంలో అసెంబ్లీలోనూ.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో జ్యోతుల వాగ్వాదానికి దిగారు. తనను మాట్లాడమంటే మాట్లాడతానని లేకపోతే.. వెళ్లిపోతానని భీష్మించారు. తనకంటే సీనియర్లు ఎవరూ లేరని కూడా అన్నారు. కట్ చేస్తే.. ఈ అసంతృప్తికి.. ఆవేదనకు కారణం.. తనకు సరైన గుర్తింపు లేకపోవడమేనన్నది. నిజానికి జ్యోతుల మంత్రి వర్గంలో చోటు ఆశించారు. కానీ, దక్కలేదు. అది కాకుండా.. వేరే పదవి అయినా.. దక్కకపోతుందా? అనుకున్నారు. అదే ఉపసభాపతి స్థానం. కానీ.. ఈ విషయంలోనూ చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ ఆవేదన, ఆక్రోశం.. ఆయనను నిలబడనివ్వలేదన్న చర్చ జరుగుతోంది. అందుకే ఇలా కామెంట్లు చేస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది.
