Begin typing your search above and press return to search.

శభాష్ పోలీస్: చేతిలో చంటిబిడ్డ.. ‘డ్యూటీ’ చేసేశాడు

కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. డ్యూటీలో ఉన్నామా? లేమా? అన్న దాంతో సంబంధం ఉండదు. అనుక్షణం డ్యూటీలోనే ఉంటారు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 7:30 AM GMT
శభాష్ పోలీస్: చేతిలో చంటిబిడ్డ.. ‘డ్యూటీ’ చేసేశాడు
X

కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. డ్యూటీలో ఉన్నామా? లేమా? అన్న దాంతో సంబంధం ఉండదు. అనుక్షణం డ్యూటీలోనే ఉంటారు. ఆ కోవలోకే వస్తుంది పోలీస్ ఉద్యోగం. పని గంటలు అయిపోయాయి కదా? అని లైట్ తీసుకొనే వాళ్లు కొందరు ఉండొచ్చు. కానీ.. అత్యధికులు తమ డ్యూటీ కాని టైంలోనూ తమ జాబ్ పట్ల కమిట్ మెంట్ తో ఉంటారు. అలాంటి తీరుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు తమిళనాడుకు చెందిన ఒక పోలీస్.


తిరువారూర్ సిటీ శాంతిభద్రతల విభాగంలో పని చేసే మణికంఠన్ చేసిన పనికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుల్లో ఇలాంటి కమిట్ మెంట్ ఉన్న పోలీసుకు సెల్యూట్ చేస్తున్నారు. సీనియర్ అధికారులు సైతం ఆయన్ను అభినందిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత.. సోషల్ మీడియా పుణ్యమా అని.. అతగాడు చేసిన పని.. పని పట్ల అతనికున్న కమిట్ మెంట్ ఏమిటన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తెలిసేలా చేసింది.

ఇంతకూ అసలేం జరిగిందంటే.. స్టేషన్ లో డ్యూటీ అయిపోయిన తర్వాత భార్య.. చంటిబిడ్డతో కలిసి ఇంటికి అవసరమైన వస్తువుల్ని కొనేందుకు టూ వీలర్ మీద విలామల్ ప్రాంతానికి వెళుతున్నారు. ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ అధికంగా ఉండటం.. దాన్ని నియంత్రించే వారు ఎవరూ లేకపోవటంతో.. వెంటనే బండిని పక్కకు ఆపేసి.. చంటిబిడ్డను చేతిలో ఉంచుకొని వాహనాల్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున క్లియర్ చేసుకుంటూ వచ్చారు.

పని పట్ల ఆయనకున్న కమిట్ మెంట్ ను గుర్తించిన కొందరు ఆయన పనిని వీడియో తీశారు. ఇది కాస్తా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయటం.. అది కాస్తా ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. ఆయనపై ప్రజలు మాత్రమే కాదు పోలీసు శాఖ కూడా అభినందనల వర్షం కురిపించింది. ఆయన్ను జిల్లా ఎస్పీ పిలిపించి బహుమతి అందించారు. ప్రత్యేకంగా అభినందించారు. పని పట్ల ఆయన కమిట్ మెంట్ కు సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.