పాతబస్తీ రౌడీషీటర్ల ఇంట్లో పోలీసుల సోదాలు.. షాకింగ్ సీన్లు
అనూహ్య రీతిలో నిర్వహించిన సోదాల్లో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.
By: Tupaki Desk | 25 Dec 2025 2:31 PM ISTఅనూహ్య రీతిలో నిర్వహించిన సోదాల్లో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ పాతబస్తీలోని రౌడీషీటర్ కం పహిల్వాన్.. అతని కొడుకుల ఇళ్లల్లో పోలీసు ఉన్నతాధికారుల నాయకత్వంలో సోదాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు మారణాయుధాలతో పాటు.. కీలక పత్రాల్నిస్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలో కరుడుగట్టిన రౌడీషీటర్ గా పేరున్న జఫర్ పహిల్వాన్.. అతని కొడుకులు సయిద్.. సులేమాన్ ఇళ్లల్లో డీసీపీ కిరణ్ ఖరే.. ఆయన టీం సోదాలు నిర్వహించారు.
రౌడీషీటర్ జఫర్ విషయానికి వస్తే.. ఇతను గతంలో పలు కుస్తీ పోటీల్లో పాల్గొనటమే కాదు.. విజేతగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ ఉంది. అదే సమయంలో రెండుసార్లు కానిస్టేబుల్ సర్వీససు నుంచి తొలగించిన ఘన చరిత్ర ఇతగాడి సొంతం కార్పొరేటర్ గా కూడా పని చేశాడు. ఇతడి మీద ఉన్న నేరారోపణలు అన్నిఇన్ని కావు.
అతని ఏరియా పరిధిలోఎవరైనా ఇంటి నిర్మాణం చేపడితే.. అతడికి మామూలు చెల్లించాల్సిందే. ఇంటికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పైసలు ఇచ్చుకోవాల్సిందే. లేని పక్షంలో వారి ఇంటి నిర్మాణం ముందుకు సాగదని చెబుతుంటారు. ఇలా రౌడీయిజంతో పాటు.. మారణాయుధాలతో బెదిరింపులకు దిగటం ఇతనికి రోటీన్ గా చెబుతారు.
గతంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలోకి వెళ్లి పిస్టల్ కాల్పులు జరపటం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పదేళ్ల క్రితం జైలుకు వెళ్లాడు. ఇప్పటికి ఇతడిపై నలభైకు పైగా కేసులు ఉన్నాయని.. అతడి కొడుకులపైనా కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీసీపీ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలు మారణాయుధాలు దొరటం సంచలనంగా మారింది. ఈ లెక్కన.. పాతబస్తీ పరిధిలో నేరారోపణలు ఉన్న నేరస్తుల ఇళ్లల్లో మూకుమ్మడి సోదాలు నిర్వహిస్తే ఇంకెన్ని సంచలనాలు వెలుగు చూస్తాయో?
