Begin typing your search above and press return to search.

నిందితుడిపై జమ్మూ పోలీసుల అతి.. తెనాలి పోలీసులేం పనికొస్తారు?

తెనాలి పోలీసుల తీరును కొందరు సమర్థిస్తే.. మరికొందరు తప్పు పట్టారు. మొత్తంగా తెనాలి పోలీసుల కారణంగా ఏపీలోని కూటమి సర్కారు సైతం ఇరుకున పడిన పరిస్థితి.

By:  Tupaki Desk   |   25 Jun 2025 12:00 PM IST
నిందితుడిపై జమ్మూ పోలీసుల అతి.. తెనాలి పోలీసులేం పనికొస్తారు?
X

తప్పుడు పనులు చేసిన వారిని అదుపులోకి తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. కేసులు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి.. విచారణ అనంతరం కోర్టు వేసే శిక్షల్ని అమలు చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటానికి.. ఇష్టారాజ్యంగా దండించటానికి పోలీసులకు అధికారం ఉండదు. కానీ.. కొందరు పోలీసులు మాత్రం చట్టాన్ని వదిలేసి.. తమదైన రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటారు. కొద్ది వారాల క్రితం ఏపీలోని తెనాలి పోలీస్ స్టేషన్ లో.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంగా కొందరు యువకుల్ని అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్ బయట..కర్రలతో కాళ్ల మీద కొట్టిన కొట్టుడు వీడియో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే.

తెనాలి పోలీసుల తీరును కొందరు సమర్థిస్తే.. మరికొందరు తప్పు పట్టారు. మొత్తంగా తెనాలి పోలీసుల కారణంగా ఏపీలోని కూటమి సర్కారు సైతం ఇరుకున పడిన పరిస్థితి. కట్ చేస్తే..తెనాలి పోలీసుల అతికి మించిన అతిని తాజాగా ప్రదర్శించారు జమ్మూ పోలీసులు. మందులు కొంటున్న రోగి అటెండర్ వద్ద నుంచి రూ.40వేలు దోచాడన్న ఆరోపణలతో ఒక వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు తీవ్రంగా హింసించారు.అది కూడా బహిరంగంగా.

సదరు వ్యక్తిని కొట్టిన పోలీసులు.. చేతులు కట్టేసి.. మెడలో చెప్పుల దండేసి.. కారు బాయినెట్ మీద కూర్చోబెట్టి ఊరేగించిన వైనంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమక్షంలో పోలీసులు ఒక వ్యక్తిని అంతలా ఎలా అవమానిస్తారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తిని అవమానించటం చట్ట ఉల్లంఘనే అవుతుందని మండి పడుతున్నారు. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తటంతో జమ్మూ పోలీసు సీనియర్ సూపరింటెండెంట్ స్పందించారు. ఇటీవల పోలీసులకు పట్టుబడిన నిందితుడు ఒక పేరు మోసిన ముఠాలో సభ్యుడని.. కొద్ది రోజుల క్రితం ఒక రోగికి అవసరమైన మందుల్ని కొనే వేళ.. రోగి అటెండెంట్ నుంచి రూ.40వేలు చోరీ చేసి పరారైనట్లు పేర్కొన్నారు.

తన దగ్గర దోచిన డబ్బును తిరిగి తీసుకునే క్రమంలో నిందితుడి వెంట పడిన బాధితుడ్ని.. కత్తితో గాయపర్చాడు. ఈ నేపథ్యంలో అక్కడే గస్తీ కాస్తున్న పోలీసులు ఈ ఉదంతాన్ని గుర్తించి వెంటనే పట్టుకొని అతడికి దేహశుద్ధి చేసి.. మెడలో చెప్పుల దండ వేసి.. ఊరేగించారు. దీనిపై స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.