Begin typing your search above and press return to search.

పోలవరం పై కేంద్రం దిగొస్తోందా ?

అలాంటిది తాజాగా తాగునీటికి ప్రభుత్వం చేసిన ఖర్చుల ను కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి రీఎంబర్స్ చేస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రకటించారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 5:27 AM GMT
పోలవరం పై కేంద్రం దిగొస్తోందా ?
X

పోలవరం ప్రాజెక్టు వ్యయం పై కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా దిగొస్తోంది. ఇంతకాలం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం సాగునీటికి అయిన ఖర్చుల ను మాత్రమే భరిస్తామని తాగునీటికి అయిన ఖర్చులతో తమకు సంబంధంలేదని కేంద్రం చెబుతోంది. అలాంటిది తాజాగా తాగునీటికి ప్రభుత్వం చేసిన ఖర్చుల ను కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి రీఎంబర్స్ చేస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ ఆమోదం తెలిపిందని కూడా జలశక్తి మంత్రి చెప్పారు.

నిజానికి పోలవరం ప్రాజెక్టు అంటే నీటి నిల్వ చేసే నిర్మాణాలు మాత్రమే కాదు. కాల్వలు, పునరావాసం తదితరాలన్నింటినీ కలిపే ప్రాజెక్టని అంటారు. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం విచిత్రంగా పునారావాసం ఖర్చుల తో సంబంధం లేదని సాగునీటి ఖర్చుల ను మాత్రమే భరిస్తామని చెప్పింది. చివరకు తాగునీటి సరఫరా కు కాల్వల తవ్వకం లాంటి పనులకు అయిన ఖర్చులను కూడా భరించేదిలేదని పదే పదే చెప్పింది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల కారణంగా కేంద్ర ప్రభుత్వం మెల్లిగా దారికి వస్తోంది.

ముందుగా ఎప్పటినుండో రావాల్సిన రీఎంబర్స్ మెంటు రు. 10 వేల కోట్లను రాబట్టింది. ఆ తర్వాత చేసిన ప్రయత్నాల కారణంగా ఇపుడు తాగునీటి సరఫరాకు చేసిన ఖర్చుల ను కూడా భరిస్తామని రాజ్యసభ లో ప్రకటించింది. ఇప్పటివరకు ఎంత ఖర్చయిందన్న వివరాలను కేంద్రం ప్రకటించలేదు. కాబట్టి తాగునీటి వసతి కోసం ప్రభుత్వం చేసిన పనులు, అయిన ఖర్చుల వివరాలు తెలియాల్సుంది. ఇదంతా ఒకఎత్తయితే పునరావాసం ఖర్చులు మరోఎత్తు.

అసలు ఏ ప్రాజెక్టులో అయినా పునరావాసం ఖర్చులే చాలా కీలకంగా ఉంటుంది. డ్యాం నిర్మాణం ఒకఎత్తయితే పునరావాసం ఖర్చలు మరోఎత్తు. అసలు పునారావాసానికే ఎక్కువ ఖర్చవుతుంది. పునరావాసమంటే జనాల ను ఉన్న ప్రాంతం నుండి ఖాళీచేయించటం వారికి మరోచోట ప్రత్యామ్నయం చూపటం, ఇళ్ళు నిర్మించి ఇవ్వటంలాంటివి.

ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయించటం లో భాగంగా నిర్వాసితుల కు మూడురెట్ల నష్టపరిహారం ఇవ్వాల్సుంటుంది. ఇదే అన్నింటికన్నా ఎక్కువ ఖర్చు. మరి ఖర్చుల ను ఎప్పటికిప్పుడు వెంటనే రీఎంబర్స్ చేయటంతో పాటు పునరావాసం ఖర్చులను భరించేందుకు కూడా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే అంటే నిధులు రాబట్టుకోగలిగితే ప్రాజెక్టు పనులు స్పీడవుతాయనటం లో సందేహంలేదు.