Begin typing your search above and press return to search.

పోలవరంపై యుద్ధం ఎఫెక్ట్.. వార్ కొనసాగితే కష్టమే!

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మన దేశంలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది.

By:  Tupaki Political Desk   |   31 March 2026 6:00 PM IST
పోలవరంపై యుద్ధం ఎఫెక్ట్.. వార్ కొనసాగితే కష్టమే!
X

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మన దేశంలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా దిగుమతులపై ఆధారపడిన వివిధ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇక ఏపీలో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు యుద్ధం సెగ తగిలింది. యుద్ధం కారణంగా ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డుగా ఉన్న బండ రాళ్లను తొలగించేందుకు అవసరమైన అమ్మోనియం నైట్రేట్ కు కొరత ఏర్పడింది. నదీగర్భంలో పెద్ద బండరాళ్లు ఉండగా, వాటిని పేల్చేందుకు అమ్మోనియం నైట్రేట్ వాడుతుంటారు. ఇది గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివుంది. యుద్ధం కారణంగా దిగుమతులకు బ్రేక్ పడటంతో పోలవరం నిర్మాణంలో దాదాపు 30 శాతం పనులు ముందుకు కదలడం లేదని అంటున్నారు.

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం స్పిల్‌వే ఛానల్ నిర్మాణం. ఈ మార్గంలో భారీ స్థాయిలో రాతి గుట్టలను తొలగించాల్సి ఉంది. ఈ రాళ్లను పగులగొట్టడానికి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. యుద్ధం కారణంగా పేలుడు పదార్థాలకు కొరత ఏర్పడటంతో గత కొన్ని రోజులుగా బ్లాస్టింగ్ పనులు మందగించాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాళ్లను తొలగించడం కూడా వెనువెంటనే జరిగే పని కాదంటున్నారు. దీంతో ప్రాజెక్టు పనులలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

పోలవరం గట్టు చాలా గట్టి గ్రానైట్ శిలలతో కూడుకున్నది. సాధారణ యంత్రాలతో వీటిని తొలగించడం అసాధ్యంగా చెబుతున్నారు. అమ్మోనియం నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేస్తేనే పని వేగంగా జరుగుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దీని కొరత వల్ల స్పిల్‌వే ఎగువ, దిగువ ప్రాంతాల్లో రాళ్లను తొలగించే ప్రక్రియ నిలిచిపోయింది. ఇది అంతిమంగా ప్రాజెక్టు గడువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో అమ్మోనియం నైట్రిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం.

అదేసమయంలో పేలుడు పదార్థాల కొరతను అధిగమించడానికి ఇంజనీర్లు కొన్ని ఇతర మార్గాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. భారీ హైడ్రాలిక్ బ్రేకర్లను ఉపయోగించి రాళ్లను పగులగొట్టొచ్చని కొందరు చెబుతుండగా, ఇది చాలా నెమ్మదైన ప్రక్రియ అంటూ ప్రాజెక్టు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కెమికల్ ఏజెంట్స్ ను వాడి శబ్దం లేకుండా రాళ్లను చీల్చే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇది ఖరీదైన వ్యవహారం కనుక ప్రభుత్వం అనుమతిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా, నాగపూర్ విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఉన్న స్థానిక ప్లాంట్ల నుండి అమ్మోనియం నైట్రేట్ సేకరించేలా ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. అయితే పేలుడు పదార్థాల తయారీపై మన దేశంలో నియంత్రణ ఉండటంతో దీనికోసం కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సివుంటుందని అంటున్నారు.