రూ.కోట్లలో చెల్లింపులు.. పోలవరం నిర్వాసితులకు ఎంత ఇచ్చారో తెలుసా?
21 నెలల్లో ప్రాజెక్టు పనులు ముమ్మరం చేశామన్నారు. వచ్చే ఏడాది ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని... రాష్ట్ర ప్రజలందరి కల సాకారం అవుతుందని సీఎం అన్నారు.
By: Tupaki Political Desk | 19 March 2026 2:56 PM ISTపోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంగా రూ.226.61 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో విడతగా ఈ మొత్తం చెల్లించారు. గతంలో రెండు విడతలుగా నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లించారు. తాజాగా రూ.226.61 కోట్లు చెల్లించడంతో మొత్తం రూ.1943 కోట్లను నిర్వాసితులకు అందజేసినట్లైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంతోపాటు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం భూము, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నిర్వాసితుల త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందన్నారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో విడతగా నిర్వాసితుల ఖాతాలకు ఈ మొత్తాన్ని జమ చేస్తున్నట్టు సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని అది పూర్తి కావటంతోపాటు నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంగా వల్ల డయాఫ్రాం వాల్ దెబ్బతిందని... నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు మళ్లీ రూ. వెయ్యి కోట్లతో కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. వారం రోజుల్లో డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి అవుతుందని, ప్రాజెక్టులో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయన్నారు.
21 నెలల్లో ప్రాజెక్టు పనులు ముమ్మరం చేశామన్నారు. వచ్చే ఏడాది ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని... రాష్ట్ర ప్రజలందరి కల సాకారం అవుతుందని సీఎం అన్నారు. గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోలేదని... వరద నీటిలో ప్రజలు మునిగిపోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం నాటి సంగతులను గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితుల్ని దృష్టిలో ఉంచుకునే రంపచోడవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తోందని అన్నారు.
21 నెలల్లో రూ.1943 కోట్ల పరిహారం చెల్లింపు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్వాసితులకు వేగంగా చెల్లింపులు చేశారు. 2025 జనవరిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మొదటి విడతగా నిర్వాసితులకు రూ.800 కోట్లు ఇచ్చారు. గత ఏడాది దీపావళికి రెండో విడతగా రూ. 916 కోట్లను జమ చేశారు. ఇప్పుడు మూడో విడతగా రూ.226.6 కోట్లను చెల్లించారు. మొత్తంగా 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లను చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండు దశల్లో జరిగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తొలిదశలో 38,068 మంది నిర్వాసితులను తరలించేందుకు చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు.
75 నిర్వాసిత కాలనీల్లో ఇప్పటికే 26 పూర్తి అయ్యాయని... ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 2022లో గుర్తించిన 17,114 మంది నిర్వాసితులకు కాలనీలను నిర్మించి తరలించేలా చర్యలు చేపడుతున్నామని సీఎం వివరించారు. 2027 ఏప్రిల్ కల్లా కాలనీలు పూర్తి చేసి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా రూ.3,500 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ప్రతి నిర్వాసితుడికి ఇంటి నిర్మాణం కోసం రూ.3.5 లక్షలు ఇస్తున్నామని, ఇంటి స్థలం కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. గత పాలనలో జరిగిన తప్పుల్ని సరిదిద్ది నిర్వాసితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పునరావాస, పరిహారాన్ని పారదర్శకంగా నిర్వాసితులకు చెల్లిస్తున్నామని చెప్పారు. మూడో మారు గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందని... పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు.
