నెలల ఫుడ్ సిద్ధం..100 కోట్ల ఫండ్.. పీవోకే ప్రజలకు పాక్ అలర్ట్
పాకిస్థాన్ ప్రయత్నాలు చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది. మనం పీవోకేగా పిలిచే ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆజాద్ కశ్మీర్ అని అంటుంది.
By: Tupaki Desk | 2 May 2025 3:11 PMపెహల్గాం దాడికి ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)పై భారత్ దాడి చేసి స్వాధీనం చేసుకుంటుందని పాకిస్థాన్ భావిస్తోందా?
పీవోకేను స్వాధీనం చేసుకోవడమే కశ్మీర్ సమస్య పరిష్కారం అనే వాదనలను భారత ప్రభుత్వం నమ్ముతున్నదా?
యుద్ధం చేసి పీవోకేను వశం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుందా..?
పాకిస్థాన్ ప్రయత్నాలు చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది. మనం పీవోకేగా పిలిచే ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆజాద్ కశ్మీర్ అని అంటుంది. పెహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారం ఉండొచ్చనే ఆందోళనలో ఉన్న పాకిస్థాన్.. ఆజాద్ కశ్మీర్ లోని ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తోంది.
యుద్ధం జరిగితే.. సమస్యలు తలెత్తకుండా రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కు సమీపంలోని 13 నియోజకవర్గాల ప్రజలకు పాక్ ప్రభుత్వం సూచనలు చేసింది. దీంతోపాటు స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసిందని.. ఆహారం, మందులు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఆటంకం లేకుండా ఇదంతా చేసిందని తెలుస్తోంది.
కాగా, స్వాతంత్ర్యం వచ్చాక భారత దేశం రెండుగా విడిపోయిన వెంటనే.. పాకిస్థాన్ కశ్మీర్ పై కన్నేసింది. అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ భారత్ లో కలవాలని నిర్ణయం తీసుకునేలోపే కశ్మీర్ లోకి పాక్ సైన్యం ప్రవేశించింది. ఆ తర్వాత భారత సైన్యం వారిని తరిమికొట్టింది. అప్పటికే వారు కొంత భాగాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అదే పీవోకే.
దాదాపు ఈ 78 ఏళ్లలో పాకిస్థాన్.. పీవోకేను అభివృద్ధి చేయలేదు. భారత్ పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పే వేదికగానే ఉపయోగించుకుంది.
పీవోకేకు ప్రజల చేత ఎన్నికైన ప్రధాని కూడా ఉంటారు. కానీ, అతడు పాక్ చెప్పు చేతల్లో పనిచేస్తుంటాడు. ఇక కొన్నేళ్లుగా పీవోకే ప్రజలు పాకిస్థాన్ పెత్తనంపై తిరుగుబాటు చేస్తున్నారు. భారత్ లో కలుస్తామని ఆందోళనలు చేస్తున్నారు.
బ్రిటీష్ ఎంపీ, భారత సంతతికి చెందిన మేఘనాథ్ సైతం పీవోకేను భారత్ స్వాధీనం చేసుకుంటేనే కశ్మీర్ సమస్య పూర్తిగా పరిష్కారం అని సూచించారు. మరి.. మోదీ ప్రభుత్వం ప్రతీకార చర్యల్లో ఇదీ ఉందా?